ద్వంద్వర్థాలకు తావులేని మంచి ఫ్యామిలీ వినోదాత్మక చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా"
కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన నటుడు శ్రీనివాస రెడ్డి. ఈయన గతంలో కోనవెంకట్ దర్శకత్వంలో వచ్చిన 'గీతాంజలి' చిత్రంలో హీరో కాకున్నప్పటికీ హీరో స్థాయిలో పాత్రను చేసి ప్రేక్షకులను మెప్పించాడు.
నటీనటులు.. శ్రీనివాసరెడ్డి, పూర్ణ, రవివర్మ, కృష్ణభగవాన్, జీవా, ప్రవీణ్, శ్రీవిష్ణు, జోగీ బ్రదర్స్ తదితరులు.
సంగీతం: రవిచంద్ర
నిర్మాతలు: శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి
రచన, దర్శకత్వం: శివరాజ్ కనుమూరి
కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన నటుడు శ్రీనివాస రెడ్డి. ఈయన గతంలో కోనవెంకట్ దర్శకత్వంలో వచ్చిన 'గీతాంజలి' చిత్రంలో హీరో కాకున్నప్పటికీ హీరో స్థాయిలో పాత్రను చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం శ్రీనవాసరెడ్డి నటించిన చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంలో పూర్తిస్థాయిలో హీరోగా కనిపించాడు. శివరాజ్ కనుమూరి దర్శకత్వం వహించాడు. ఈయనే నిర్మాత కూడా. మరి శ్రీనివాస్‌రెడ్డి అండ్ టీం ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి. "జయమ్ము నిశ్చయమ్మురా" సినిమా టైటిల్‌కు తగ్గట్టు ఉందా? లేదా? అనే విషయాలు పరిశీలిస్తే..
కథ:
సర్వేష్ అలియాస్ సర్వమంగళం కరీంగనర్‌లోని సదాశివపల్లెలో తన తల్లితో కలిసి ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అన్నీ ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే సర్వమంగళం(శ్రీనివాసరెడ్డి) మూఢనమ్మకాలను కూడా బాగా నమ్ముతుంటాడు. సర్వమంగళం మూఢనమ్మకాలను, అమాయకత్వాన్ని పితా(జీవా) క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా సర్వమంగళంకు కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కోసం అనారోగ్యంతో బాధపడే తల్లిని విడిచిపెట్టలేక, తల్లి కోసం తొందరగా బదిలీ పెట్టుకుని కరీంనగర్‌కు వచ్చేస్తానని తల్లికి మాట ఇచ్చి బయలుదేరుతాడు. కాకినాడ చేరుకున్న సర్వమంగళం అమాయకత్వాన్ని చూసి అందరూ అతన్ని చిన్నచూపు చూస్తుంటారు.
ఓ రోజు రాణి(పూర్ణ)ని ప్రేమలో పడిన సర్వమంగళం ఆమె సమాధానం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. సర్వమంగళం పనిచేసే మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న మీ సేవ ఆఫీస్‌లో పనిచేసే రాణికి ఓ నర్సరీ ప్రారంభించాలనే కోరిక ఉంటుంది. సర్వమంగళం భయంతో రాణికి తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు. ఓ రోజు ధైర్యం చేసి తన ప్రేమను చెప్పాలనుకుంటున్న తరుణంలో రాణి మరెవరినో ప్రేమిస్తుందని తెలుకుంటాడు. ఇంతకీ రాణి ప్రేమించేదెవరిని? సర్వమంగళం తన ప్రేమను గెలిపించుకున్నాడా? జె.సికి, సర్వమంగళంకు ఉన్న గొడవేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....
చిత్ర సమీక్ష:
దర్శకుడు శివరాజ్ కనుమూరి సినిమాను వినోదంతో జతచేసి తెరకెక్కించిన తీరు బావుంది. పితా క్యారెక్టర్‌లో జీవా, అడపా ప్రసాద్ క్యారెక్టర్‌లో కృష్ణభగవాన్, తత్కాల్ పాత్రలో ప్రవీణ్, గుంటూరు పంతులు పాత్రలో పోసాని కృష్ణమురళి, జోగీ బ్రదర్స్ క్యారెక్టర్స్‌ను చాలా దర్శకుడు ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించాడు. కథను నడిపించిన తీరు బావుంది. ఎక్కడా ద్వంద్వర్థాలకు తావు లేకుండా చక్కగా తెరపై ఆవిష్కరించాడు. పవన్‌కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమా పోస్టర్‌ను కథకు తగిన విధంగా డైరెక్టర్ తెరపై చూపించిన విధానం సూపర్బ్. మంచి దర్శకత్వానికి రవిచంద్ర సంగీతం, కార్తీక్ రోడ్రిగ్వెజ్ నేపథ్య సంగీతం ఇంకా బలాన్ని చేకూర్చాయి. నగేష్ బానెల్ తన కెమెరాతో ప్రతి సన్నివేశాన్ని అందంగా చూపించాడు. ఇక పాత్రల విషయానికి వస్తే శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడుగా తెలంగాణ యాసలో మాట్లాడిన తీరు బావుంది.
ఇక నటన విషయానికి వస్తే మూఢనమ్మకాలను నమ్మే యువకుడిగా ఫస్టాఫ్‌లో, తన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే యువకుడిగా, ప్రేమను గెలుచుకునే వ్యక్తిగా సెకండాఫ్‌లో శ్రీనివాస్ మంచి నటనను ప్రదర్శించాడు. అడపా ప్రసాద్ పాత్రలో కృష్ణభగవాన్ నటన సింప్లీ సూపర్బ్. ఈ పాత్ర క్రియేట్ చేసిన హాస్యం ఆసాంతం నవ్వించింది. అలాగే తత్కాల్ పాత్రలో ప్రవీణ్, గుంటూరు పంతులు పాత్రలో పోసానిల మధ్య జరిగే కామెడి, సంభాషణ, అలాగే సందర్భానుసారంగా వచ్చే కామెడి ప్రేక్షకులను నవ్విస్తుంది. చాలా రోజుల తర్వాత రవివర్మ జె.సి పాత్రలో చక్కగా నటించాడు. పితా పాత్రలో జీవా, హీరోయిన్ పాత్రలో కృష్ణుడు, జోగి బ్రదర్స్ సహా మిగిలిన అందరూ ఆయా పాత్రల్లో చక్కగా నటించారు.