జానకీ నాయకుడికి ప్రేక్షకుల జేజేలు?.. 'జయ జానకి నాయక' మూవీ రివ్యూ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "జయ జానకి నాయక". పక్కా మాస్ మసాలా సినిమాల్లో అందమైన ఫ్యామిలీని జతచేసి ఫక్తు కమర్షియల్ చిత్రంగా తె
చిత్రం: జయ జానకి నాయక
నటీనటులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యాజైశ్వాల్, కేథరిన్ ట్రెస్సా, సుమన్, జగపతిబాబు, శరత్‌కుమార్ తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "జయ జానకి నాయక". పక్కా మాస్ మసాలా సినిమాల్లో అందమైన ఫ్యామిలీని జతచేసి ఫక్తు కమర్షియల్ చిత్రంగా తెరకెక్కించడంలో అందెవేసిన చేయి బోయపాటిది. టాప్ హీరోలతోనే సినిమాలు చేసే బోయపాటి తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వంటి యువ హీరో చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ చిత్రమే 'జయ జానకి నాయక'.
ఈ చిత్రం విడుదలకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌లోనే హీరో చెప్పిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'వదులుకోవాల్సి వచ్చిన ప్రతిసారీ ప్రేమనే ఎందుకు వదులుకోవాలి? నేను వదలను.. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి' అంటూ ట్రైలర్‌లో హీరో చెప్పిన డైలాగులు ప్రజల్లోకి చేరువయ్యాయి. అందుకే ఈ చిత్రానికి ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారా లేదా అనే అంశంపై ఓ లుక్కేద్దాం.
కథ...
కేంద్ర మంత్రి పవార్ (సుమన్) కుమారుడు కాలేజీలో అల్లరి చేస్తుంటాడు. అతని అల్లరికి భయపడి ఓ అమ్మాయి టీసీ తీసుకుని వెళ్లిపోతుంది. ఆమెను స్వీటీ (రకుల్ ప్రీత్‌సింగ్) ఆపుతుంది. అది గమనించిన ఆకతాయి ఆమెపై కూడా దౌర్జన్యం చేయాలనుకుంటాడు. అప్పుడు గగన్ (సాయిశ్రీనివాస్) ఆపుతాడు. గగన్‌కి తోడుగా అతని తండ్రి చక్రవర్తి (శరత్‌కుమార్), సోదరుడు (నందు) కూడా ఫైట్ చేస్తారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని అశ్వత్ నారాయణ వర్మ (జగపతిబాబు) ఇంటి వేడుకకు కేంద్ర మంత్రి హాజరవుతాడు. పరువు కోసం ప్రాణాలను లెక్కచేయని వర్మ తన కుమార్తె ఆత్మహత్యకు, కాబోయే అల్లుడి చావుకు కారణమవుతాడు.
మరోవైపు డైమండ్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అంతవరకు మద్యం వ్యాపారంలో ఉన్న పవార్ దృష్టి ఈ క్రాంటాక్ట్ మీదపడుతుంది. పవరు కోసం పాటుపడే పవార్, పరువు కోసం పాకులాడే వర్మ ఆడుతున్న గేమ్‌లోకి స్వీటీ అలియాస్ జానకి (రకుల్ ప్రీత్‌సింగ్) చేరుతుంది. ఆమెను వారిద్దరి నుంచి హీరో ఎలా కాపాడుకున్నాడు? అనేది అసలు సినిమా.
అయితే, ఈ చిత్రంలో పెద్దకా హాస్యపు సన్నివేశాలు కనిపించవు. అలాగే, లవ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కడా పెద్దగా కనిపించవు. విలన్లు, విలన్ చుట్టూ మనుషులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అందువల్ల ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువమోతాదులో ఉన్నాయని చెప్పొచ్చు. అలనాటి నటి వాణీవిశ్వనాథ్ ఎంట్రీ బ్రహ్మాండంగా ఉంది. పరువు కోసం కూతురి ఆత్మహత్యకు కారణమైన వర్మ, తన ఫ్యామిలీనే మట్టుబెట్టించాలని చూసిన చెల్లిని ఏమీ అనకపోవడం, తనకు తానే కాల్చుకోవడం పెద్దగా రక్తి కట్టించవు.
విశ్లేషణ
ఈ చిత్రాన్ని బడ్జెట్‌కు ఏమాత్రం వెనుకాడకుండా నిర్మించారు. ఫలితంగా ప్రతి ఫ్రేమూ రిచ్‌గా కనిపిస్తుంది. పెళ్లిపీటల మీదే భర్తను పోగొట్టుకున్న హీరోయిన్ .. అనే కాన్సెప్ట్ ఇటీవలి కాలంలో తెలుగు సినిమా తెరపై రాకపోవడంతో ఈ స్టోరీ కాసింత కొత్తగా అనిపిస్తుంది. హంసలదీవి ఎపిసోడ్ కేవలం ఫైట్ల కోసం మాత్రమే అనిపిస్తుంది. సినిమాలో కాసిన్ని నవ్వులను జోడిస్తే బావుండేది. రోడ్డు పక్కన బజ్జీలు తింటే మనవాడు బతుకుతాడు.. విదేశీ కంపెనీల వాళ్లను ఉద్దరించాల్సిన పనిలేదని చెప్పే సందర్భంలోనూ.. రాయిలో దేవుడిని చూసే నువ్వు.. సాటి ఆడదానిలో చూడలేకపోయావ్ అనే డైలాగులోనూ, నీకు ప్రాణమే నేను పెట్టినదైనప్పుడు పరువు మాత్రం ఎక్కుడుంది.. అని హీరో అడిగేటప్పుడు.. ఇంకా పలు సందర్భాల్లో డైలాగులు మెప్పిస్తాయి. మొత్తంమీద బోయపాటి మార్క్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు తప్పక నచ్చే మాస్ చిత్రమిది.
ప్లస్‌పాయింట్లు
బెల్లంకొండ శ్రీనివాస్ గత చిత్రాలతో పోలిస్తే నటుడిగా మంచి పరిణితి కనబరిచాడు. తండ్రికి విలువిచ్చే కుర్రాడిగా, తొలిసారి అమ్మాయి ప్రేమను చవిచూసిన యువకుడిగా, కసితో పోరాడే హీరోలా చేశాడు. చిత్రంలో డ్యాన్సులు, ఫైట్లు కూడా బాగున్నాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా, కూతురి విషయంలో స్వార్థపరుడిగా జె.పి. బాగా చేశారు. పరువు కోసం పాకులాడే రిచ్ మేన్‌గా జగపతిబాబు ఒదిగిపోయారు. అటు అల్లరి పిల్లగా, బాధ్యతగా ఉన్న అమ్మాయిగా, డిప్రెషన్‌కు గురైన మగువగా రకుల్ చక్కగా కనిపించింది. గ్లామర్ పాత్రలో ప్రగ్యా, ఐటమ్ సాంగ్‌లో కేథరిన్ మెప్పించారు. తరుణ్ అరోరా యాజ్ యూజువల్‌గా కరడుగట్టిన పాత్రలో కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బావుంది. వీడే వీడే, ఎ ఫర్ అనే ఐటమ్ సాంగ్ ది బెస్ట్ సాంగ్స్. కెమెరాపనితనం మెచ్చుకోవాలి. కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బావుంది.