నటీనటులు: నాగశౌర్య-రీతూ వర్మ-నదియా-మురళీ శర్మ-వెన్నెల కిషోర్-ప్రవీణ్- హర్షవర్ధన్-సప్తగిరి-జయప్రకాష్-హిమజ-ఆనంద్ తదితరులు
సాంకేతికతః
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, మాటలు: గణేష్ రావూరి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్-థమన్, నేపథ్య సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య.
వరుడు కావలెను - అనే పేరులోనే సినిమా ఎలా వుంటుందో తెలిసిపోతుంది. ఓ అమ్మాయి తనకు తగిన వరుడుని వెతుక్కోవడమే కథ అని ఇట్టే గ్రహించేవచ్చు. దాన్ని ఏవిధంగా ఓ మహిళ దర్శకురాలు చెప్పదలచిందనేది పాయింట్. నాగశౌర్య.. రీతూ వర్మ వధూవరులుగా నటించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
కథ:
భూమి (రీతూ వర్మ) స్వంతంగా ఓ డెకరేషన్ సంస్థను స్థాపించి తన కంటూ ప్రత్యేకతను ఆపాదించుకుంటుంది. అహం, పొగరు మిళితమైన ఆమెను భరించడం స్టాఫ్‌కేకాదు ఇంటిలో తల్లికీ కష్టమే. మాట్లాడితే పెండ్లిచేసుకోమని సతాయిస్తుంటుంది ఆమె తల్లి నదియా. అలాంటి సమయంలో విదేశాల్లో జాబ్ చేసుకుంటున్న ఆకాష్ (నాగశౌర్య) ఇండియాలోని ఓ అమ్మాయిని పెండ్లిచేసుకోవాలని వస్తాడు. నాగశౌర్యకు జయప్రకాష్ మామయ్య అవుతాడు. భూమికంపెనీకి పెట్టుబడిదారుడు ఆయనే. దాంతో భూమి చేయదలచిన ప్రాజెక్ట్ డిజైన్ బాధ్యత ఆకాష్‌కు అప్పగిస్తాడు. ఆ తర్వాత ఆకాష్, భూమి మధ్య జరిగిన సంఘటనల్లో ప్రేమ పుడుతుంది. ఒకరినొకరు మనసువిప్పి మాట్లాడే సమయంలో భూమి టెంపర్ తనంతో అతన్ని దూరం చేసుకుంటుంది. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
ప్రేమకథలలో అపార్థాలు, అనుమానాలు కంటే అహం, ఇగో వల్ల విడిపోయిన కథలు చాలానే వచ్చాయి. అలాంటి కోవలోనిదే ఇది. ఇందులో భూమిక పాత్ర అచ్చం `ఖుషి`లోని భూమిక పాత్రను పోలివుంటుంది. భూమి, ఆకాష్‌ల ప్రేమించుకునే విధానం పర్వాలేదు అనిపించినా చాలా స్లోగా సాగే సన్నివేశాలు, మలుపు తిప్పే సంఘటనలు కానీ హృదయాన్ని టచ్ చేసే సందర్భాలు లేనేలేవు. వీరి ప్రేమను కలిపే క్రమంలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా సినిమాల్లో వచ్చేసినవే.
మొత్తంగా ఇందులో కొత్తదనం వుందంటే అది కేవలం సప్తగిరితో వచ్చే కామెడీ ట్రాక్. సెకండాఫ్‌లో వచ్చే ఆ పాత్రే ప్రేక్షకుల్లో ఒక ఊపు కలిగిస్తుంది. దీనిని రచయిత గణేష్ రాపూరి చక్కగా రాశాడు. సంభాషణల పరంగా పొందికగా వున్నాయి. కెమెరా పనితనం నీట్‌గా వుంది. సంగీతపరంగా బాణీలు పర్వలేదు అనిపిస్తాయి. సిద్ శ్రిరామ్ ఆలపించిన. `చూపుల్లో..`పాట చక్కటి మెలోడీగా వుంది. కాలేజీ డేస్ భూమి డాన్స్ వేస్తూ సాగిన పాట `దిగు దిగు నాధా ` అలరిస్తుంది. ఇది ఒకరకంగా అయ్యప్ప భక్తులు ఇదే తరహా బాణీలో ఆలపిస్తుంటారు.
అయితే ఈ కథలో ఇద్దరు ప్రేమికుల మధ్య సమస్యకు కారణమైంది కేవలం అపార్థం మాత్రమే. అది కూడా నాయిక పాత్ర ద్వారా వుంటుంది. అందుకే పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. ఎడబాటు, మరలా కలుసుకోవడం వంటివి మామూలే. ముగింపులోనూ భూమి పాత్రకు హీరో ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది.
ఈ మధ్య కుటుంబ ప్రేక్షకులకు ఆద్యంతం చూసే కథలు వస్తున్నాయి. అందులో ఇదొకటి. ఏది చూసిన ప్రేమ, ఆకర్షణ అనే పాయింట్ చుట్టూ కథలు వస్తున్నాయి. కానీ, తాను ఎలా వుండాలో తెలీని తనంతో బూమి పాత్ర, జీవితంలో కెరీరే ముఖ్యం ప్రేమ అనేది అందుకు అడ్డంకి అని భావించే ఆకాశ్ పాత్ర వుంటుంది. ఈ ఇద్దరి వ్యక్తుల కథే వరుడుకావలెను. ఇందులో భూమి పాత్ర దర్శకురాలి ఆలోచనలకు దగ్గరగా వుంటుంది.
ఫైనల్‌గా ఇందులో దర్శకురాలు చెప్పిందేమంటే, ఎప్పటికైనా ఒకరికొకరు తోడు అనేది వుండాలి. తల్లిదండ్రులు తర్వాత అంతలా చూసే తోడు ఒక్క వరుడులోనే వథువు వెతుక్కోవాలి. అనే సూక్తిని ఇందులో చెప్పారు.
హైలైట్స్.. పాత్రలపరంగా నటన బాగుంది.
- సంగీతం, పాటలు, అంతకుమించి సప్తగిరి ట్రాక్ సినిమాను నిలబెట్టింది.
మైనస్ః క్లాస్ మూవీ కనుక స్లో నెరేషన్ వుంది.
ప్రేమికుల మధ్య బలమైన అంశం అనేది లేకపోవడం