నటీనటులు : విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, రుహి సింగ్, నవీన్ చంద్ర
సాంకేతికతః సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ, సంగీతం: సామ్ సి ఎస్, నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్.
లాక్‌డౌన్ ముందుగా తీసిన మోసగాళ్లు సినిమా ఓటీటీ బేస్‌పైనే తీసినట్లుంది. అలాంటిది థియేటర్ల ఓపెన్ అయ్యాక దాన్ని ఈరోజే విడుదల చేశారు. టైటిల్ పెట్టినట్లు మోసం చేసేవారు ఆన్‌లైన్‌లో నిష్ణాతులు అయితే ఎలా వుంటుంది? దేశం కాని దేశంలోని డబ్బును ఎలా దొంగిలించారనేది పాయింట్. ఇది ఇండియాకు చెందిన ఇద్దరు అక్కాసోదరుడు చేసిన స్కాం అని ప్రచారం చేశారు. దానికితోడు సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర, కాజల్, నవదీప్ ఇంతమంది వుండగా, ఇది మల్టీస్టారర్ కాబట్టి ఎంతో బాగుంటుందని అనుకోవడం సహజమే. మరి సినిమా అలానే వుందా? లేదా? తెలుసుకుందాం.
కథ :
సిటీలోని ఓ మురికివాడలో వుంటూ చిన్నప్పటి నుంచే పేదరికం నుంచి వచ్చిన అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) అక్కా తమ్ముడు. వారి జీవితాలపై పెద్ద కలలు కంటూ ఉంటారు. మరి అలా ఎదిగాక అర్జున్ ఒక పర్ఫెక్ట్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ గానూ అలాగే అను అకౌంటెంట్ స్థాయికి ఎదుగుతారు. వీరికి అర్జున్ బాస్ సందీప్ రెడ్డి (నవదీప్) నుంచి ఒక భారీ స్కామ్ ప్లాన్ కోసం చర్చ వస్తుంది. అది కూడా అమెరికన్స్ మీదనే చెయ్యాలని అనుకుంటారు. మరి ఇక్కడ నుంచి వీళ్ళ భారీ స్కామ్ వందల మిలియన్ డాలర్ల స్కామ్‌గా ఎలా మారుతుంది? ఆ తర్వాత ఏమి జరిగింది? అమెరికా ఏమి చేయలేకపోయిందా? అనేది చూడాల్సిందే.
విశ్లేషణః
ఆన్‌లైన్ మోసాలు అనేవి రోజూవారీ పేపర్లలోనే చూస్తున్నాం. నైజీరియన్లు ఎలా మాయ చేస్తారో తెలిసిందే. అలాంటిది విశాల్ చేసిన `అభిమన్యుడు`లో మరింత కూలంకషంగా ఎలా మోసాలు చేయవచ్చో దానివల్ల ఎందరి జీవితాలు నాశనం అవుతాయనేది స్పష్టంగా తెలియజేశాడు. కానీ ఈ మోసగాళ్ళులో మాత్రం అంతలా అందరికీ కనెక్ట్ అయ్యే అంశం మాత్రం ఏమీలేదు.
దేశంలో పెద్ద పెద్ద స్కాంలు బ్యాంకుల కుంభకోణాలు చేసి విదేశాలకు వెళ్ళే వాళ్ళను చూశాం. వారిని ఆ దేశం కానీ, ఈ దేశం కానీ ఏమీ చేయలేని స్థితి. కోర్టు కేసులు, వాయిదాలు పడడం. అసలు దేశం విడిచి రాకపోవడం వంటివన్నీ మన కళ్ళముందు చూస్తున్నవే. అయితే అమెరికా బేస్‌మీద స్కాం చేయడం అనేది ఎక్కడా లాజిక్కుకు అందదు. పైపైనే తేల్చేశాడు. ఇలాంటి స్కామ్ తెలియని ఆడియెన్స్‌కు అయితే ఈ చిత్రం కొంత థ్రిల్‌ను ఇస్తుంది.
నటనాపరంగా చూస్తే, అక్కాతమ్ముళ్లుగా మంచు విష్ణు, కాజల్ బాగానే చేశారు. మరో కీలక పాత్రలో నవదీప్ మెప్పించాడు. అతని మేకోవర్ కానీ నటన కానీ ఇంప్రెసివ్‌గా ఉంటాయి. నవీన్ చంద్ర తన అగ్రెసివ్ రోల్‌లో ఆకట్టుకుంటాడు అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పోలీసు ఆఫీసర్‌గా తన రోల్ మేర మంచి నటన కనబరిచారు.
ఇందులో ప్లస్‌లు కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువే కనిపిస్తాయి. ఇలాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా తీసేటప్పుడు డీటెయిల్స్ చాలా అవసరం. ఎంత కన్వీనెంట్‌గా క్లియర్‌గా నేరేషన్ ఉంటే సినిమా తాలూకా ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. కానీ మేకర్స్ అలాంటివి అంతగా చూపించినట్టు అనిపించదు. దానికితోడు క్లైమాక్స్ క్లారిటీగా లేదు. అలాగే సునీల్ శెట్టి లాంటి నటులు సహా మిగతా కొందరు నటీనటులు ఈ సినిమాకు అంతగా ఇంపాక్ట్ కలిగించని భావన ఈ సినిమా చూసినంతసేపు కలుగుతుంది.
అభిమన్యుడు సినిమాలో అర్జున్, విశాల్ నటనతో పాటు థ్రిల్స్ పోలీసులు కూడా షాక్ అయ్యే అంశాలు కనిపిస్తాయి. కానీ ఇందులో ఇంటర్‌నేషనల్ స్థాయి కథ అనుకున్నప్పుడు ఎఫ్.బి.ఐ. సంస్థ చేస్తున్న పరిశోధన అనుకున్నప్పుడు ఎంత కేర్ తీసుకోవాలో చెప్పనక్కర్లేదు. కానీ అవేవీ ఇందులో కనిపించవు. ఈ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ బాలీవుడ్ టీవీ సీరిస్ సిఐడి కంటే తక్కువ స్థాయిలో వున్నాయి. ఇక ఎమోషన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు ఏమీలేవు.
నిర్మాణ విలువులు పర్వాలేవు. మంచి రిచ్ గానే సినిమా అంతా కనిపిస్తుంది. అలాగే సామ్ సీఎస్ ఇచ్చిన సంగీతం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఈ సినిమాకు ప్రధాన పాత్ర పోషించాయి. అలాగే ఎడిటింగ్ ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేది. దర్శకుడు జెఫ్రీ గీ చిన్ నిజమైన కథ కాబట్టి ఆ స్కామ్ రిలేటెడ్ అంశాలను బాగా చూపించగలిగారు కానీ డీటెయిల్స్ లాజిక్స్‌ను చాలానే మిస్ చేశారు. అందుకే ఎక్కడా సీరియస్‌నెస్ కనిపించకుండా కొన్ని చోట్ల విసుగుపుట్టిస్తుంది. ఇలాంటివి సామాన్య ప్రేక్షకుడు నమ్మే విధంగా తీయాలి. అదే ఈ సినిమాకు లోపం. ఇది ఏమేరకు ఆడుతుందో ప్రేక్షకులే చెప్పాలి.