"గౌతమిపుత్ర శాతకర్ణి" రివ్యూ రిపోర్ట్.. చిత్రం ఎలావుందంటే...
నందమూరి బాలకృష్ణకి మరోపేరు సంక్రాంతి హీరో. ఇప్పుడు మరోసారి పండగ సందర్భంగానే బాలయ్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ సినీ ప్రయాణానికి ఓ కీలకమైన మైలురాయి ఈ చిత్
రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి
సినిమా పేరు: గౌతమీపుత్ర శాతకర్ణి
తారాగణం: బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని, కబీర్ బేడి, శివరాజ్ కుమార్ తదితరులు
సంగీతం: చిరంతన్ భట్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: వై.రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
విడుదల: 12-01-2017
నందమూరి బాలకృష్ణకి మరోపేరు సంక్రాంతి హీరో. ఇప్పుడు మరోసారి పండగ సందర్భంగానే బాలయ్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ సినీ ప్రయాణానికి ఓ కీలకమైన మైలురాయి ఈ చిత్రం. దీనికి కారణం ఇది బాలయ్య వందో చిత్రం. అది కూడా చారిత్రాత్మక కథతో కూడుకున్నది కావటం మరోవిశేషం. తెలుగు జాతి వీరత్వాన్ని చాటి చెప్పిన శకపురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్యను.. ఆయన హావభావాలను.. పౌరుషంతో చెప్పిన సంభాషణల్ని ప్రచార చిత్రాల్లో చూసినప్పట్నుంచి ప్రేక్షకుల్లో ఆత్రుత.. అంచనాలు పెరిగిపోయాయి. మరి అందుకు తగ్గట్టుగానే బాలయ్య తెరపై విజృంభించాడా? లేదా అన్నది ఓ సారి విశ్లేషణ చేస్తే....
కథ..
ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అఖండ భరతజాతి అని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి. దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటారు. సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన నహపాణుడి(కబీర్‌బేడీ)ని ఓడించి శకపురుషుడిగా అవతరిస్తారు. ఉత్తరదక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తారు. అయితే.. అలెగ్జాండర్ కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కుంచుకోవాలని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రయస్‌ని శాతకర్ణి ఎలా ఓడించాడు? తాను కలలుగన్న అఖండభారతావనని ఎలా సృష్టించాడు? అన్నదే మిగిలిన కథ.
ఈ చిత్రం తెలుగు జాతి, తెలుగు వీరుడి గొప్పతనాన్ని చాటి చెప్పేది. ప్రధానంగా యుద్ధ ఘట్టాల నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. కానీ వాటిల్లోనే బలమైన భావోద్వేగాలు పండాయి. నహపాణుడిని ఓడించే సన్నివేశాలు.. ఆ నేపథ్యంలో వచ్చే పోరాట దృశ్యాలు సినిమాకి కీలకంగా మారాయి. నహపాణుడు సామంతరాజల వారసులని తనదగ్గర బంధించి.. యుద్ధానికి వచ్చేటప్పుడు శాతకర్ణిని తన కొడుకు పులోమావిని తీసుకుని రమ్మని చెప్తాడు. అందుకు తగ్గట్లే శాతకర్ణి యుద్ధానికి కుమారుడిని తీసుకెళ్తాడు. దానిపై శాతకర్ణి భార్య వాసిష్ఠి దేవి అడ్డుచెప్పే సన్నివేశాలు ప్రేక్షకులన్ని కంటతడి పెట్టిస్తాయి.
ఇకపోతే.. రాజసూయ యాగం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయువు పట్టులా ఉన్నాయి. మాతృమూర్తి గొప్పతనాన్ని చాటిచెబుతూ ఆ ఘట్టాలు సాగుతాయి. డెమిత్రియస్‌పై యుద్ధ సన్నివేశాలు సుదీర్ఘంగా సాగినప్పటికీ అందులో బాలకృష్ణ చేసే విన్యాసాలు, ఆయన నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక సంభాషణలు సినిమాకు ప్రధాన బలం. యుద్ధ సన్నివేశాలకు ధీటుగా ఒకొక్క మాట ఓ తూటాలా పేలింది. ఓ చారిత్రాత్మక కథకి బలమైన మాస్ అంశాలను జోడించి చెప్పిన విధానం క్రిష్ పనితనానికి అద్దం పడుతుంది.
ఇది బాలకృష్ణ ఒన్‌మాన్ షో అన్నట్లు ఈ చిత్రం సాగుతుంది. ఓవైపు భావోద్వేగాలను ఎంత అద్భుతంగా పండించారో.. అటు పోరాటఘట్టాల్లోనూ ఆయన ఆకట్టుకున్నారు. ప్రతి సన్నివేశంలోనూ చురుగ్గా కన్పించారు. శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో హేమమాలిని ఒదిగిపోయారు. శ్రియ వాసిష్ఠిదేవిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. నహపాణుడిగా కబీర్‌బేడి ఆకట్టుకుంటారు. దర్శకుడు పనితనం అడుగడుగునా కన్పిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనం కూడా శాతవాహనుల కాలంలో ఉన్నామేమో.. శాతకర్ణి సైన్యంలో మనమూ ఓ భాగమేమో అని భావోద్వేగం చెందేలా ఆయన సన్నివేశాలను తీర్చిదిద్దారు.
ఇదొక చారిత్రాత్మక చిత్రమనే భావన కలగనీయకుండా ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేశారు. చిరంతన్ భట్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయి. సాయిమాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణలు రాశారు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన సంభాషణల చాతుర్యం కన్పిస్తూనే ఉంటుంది. యుద్ధం ఆవశ్యకతని బాలకృష్ణ, హేమమాలిని చెప్పే సంభాషణలతో పాటు బౌద్ద గురువులు 'నువ్వు కడుపున మోస్తున్నది ఓ మారణహోమాన్ని' అని చెప్పే మాటలు థియేటర్‌లో మరింత ప్రభావంగా విన్పించాయి. సిరివెన్నెల సాహిత్యం, నిర్మాణ విలువలు ఇలా వేటికమే సాటి అన్పిస్తాయి.