#ArjunReddy : పోస్టర్లలో చూపించిన వేడి చిత్రంలో లేదు .. "అర్జున్ రెడ్డి" మూవీ రివ్యూ
తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల అత్యంత వివాదాస్పదమైన చిత్రం "అర్జున్ రెడ్డి". సాధారణంగా పలు తర్వాత రిలీజ్ అయిన సినిమాలకు పెద్దగా హైప్ క్రియేట్ అవ్వదు. కానీ అర్జున్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆ సిన
టైటిల్ : అర్జున్ రెడ్డి
తారాగణం : విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు
సంగీతం : రధన్
దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగా
నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగా
తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల అత్యంత వివాదాస్పదమైన చిత్రం "అర్జున్ రెడ్డి". సాధారణంగా పలు తర్వాత రిలీజ్ అయిన సినిమాలకు పెద్దగా హైప్ క్రియేట్ అవ్వదు. కానీ అర్జున్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆ సినిమాకు చిత్ర యూనిట్ ఆశించిన దానికన్నా బాగానే పబ్లిసిటీ వచ్చింది. దీనికి కారణం ఆ చిత్రం పోస్టర్లే. హీరో, హీరోయిన్లు లిప్ లాక్ కిస్‌లో నిమగ్నమైవుండే పోస్టర్లను ముద్రించి హైదరాబాద్ నగర వ్యాప్తంగా గోడలపై అంటించారు. వీటిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ పోస్టర్లపై రాజకీయ నాయకులు, మహిళా సంఘాల విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు సినిమాలకు నష్టం కన్నా లాభమే ఎక్కువ చేశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కథ ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
మూవీ స్టోరీ...
అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ)... స్వతంత్ర భావాలున్న ఆవేశపరుడైన వైద్య విద్యార్థి. తన జూనియర్ అయిన ప్రీతి (షాలిని పాండే)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ప్రీతి కూడా అర్జున్ మీద ప్రేమ పెంచుకుంటుంది. కాలేజ్ రోజులు పూర్తయ్యేసరికి వాళ్ల మధ్య చాలా సన్నిహితం ఏర్పడుతుంది. కానీ ప్రేమ కథల్లోలాగే ఈ ప్రేమ కథలో కూడా హీరోయిన్ తండ్రి వాళ్ల ప్రేమకు అడ్డు చెపుతాడు. అంతేకాదు.. ఆమెకు నచ్చని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి కూడా చేసేస్తాడు.
ప్రీతి దూరమైన అర్జున్ రెడ్డి మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోతాడు, ఇంటి నుంచి బయటకు వచ్చేసి చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. తన కోపం కారణంగా తనకు ఎంతో ఇష్టమైన డాక్టర్ వృత్తికి కూడా దూరమవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అర్జున్ రెడ్డి తిరిగి కోలుకున్నాడా..? అతడి ప్రేమకథ సుఖాంతమయ్యిందా.. లేదా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటుడికి అర్జున్ రెడ్డి లాంటి పాత్ర ఓ ఛాలెంజ్ లాంటిదే. అలాంటి టిపికల్ క్యారెక్టర్‌లో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడనే చెప్పాలి. పట్టలేని కోపం, ప్రేమ ఉన్న వ్యక్తిగా.. వ్యసనాలకు బానిసనై భగ్న ప్రేమికుడిగా విజయ్ మంచి వేరియేషన్స్ చూపించాడు. ఇక హీరోయిన్‌గా షాలిని పాండే ఆకట్టుకుంది. తన పరిధి మేరకు మంచి నటన కనబరించింది. హీరో ఫ్రెండ్ శివ పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమా అంతా హీరోతో పాటే ట్రావెల్ చేస్తూ మంచి కామెడీ పండించాడు. ఇతర పాత్రల్లో సంజయ్ స్వరూప్, కళ్యాణ్, కమల్ కామరాజ్ లు ఆకట్టుకున్నారు.
టెక్నికల్ పరంగా..
దేవదాసు కథనే మరోసారి ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా మలిచిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మంచి విజయం సాధించాడు. సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. కేవలం యువతను మాత్రమే దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించిన అర్జున్ రెడ్డి.. ఆ వర్గాన్ని బాగానే మెప్పిస్తుంది. కొన్ని బోల్డ్ సన్నివేశాలు, డైలాగ్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాల్లో దర్శకుడు ప్రతిభ కనిపిస్తోంది. తాను కూడా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పిన దర్శకుడు తన ప్రేయసి దూరమైనప్పుడు హీరో పడే మనోవేదనను చాలా బాగా చూపించాడు. అయితే సినిమా నిడివి విషయంలో కాంప్రమైజ్ కాకపోవటం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది.
ఫస్ట్ హాఫ్ కాస్త త్వరగానే ముగిసినా.. సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. క్లైమాక్స్ పాజిటివ్‌గా ముగించాలన్న ఉద్దేశంతో కావాలని మలుపు తిప్పినట్టుగా అనిపిస్తుంది. సంగీత దర్శకుడు రధన్ పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనూ ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.