నటీనటులు: అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, అమ్ము అభిరామి
సాంకేతికత - సినిమాటోగ్రఫీ: గోపీనాథ్, ఎడిటర్: ఆంథోని, సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్, నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్, దర్శకత్వం : హరి
ఈ వారం తెలుగు సినిమాలతోపాటు తమిళ చిత్రం కూడా విడుదలైంది. తమిళ నటుడు అరుణ్ విజయ్ నటించిన యానై. తెలుగులో ఏనుగు పేరుతో రిలీజ్ అయ్యింది. ప్రియా భవానీ శంకర్ నాయికగా నటించింది. `ఏనుగు` అనే పేరు ఆసక్తికరంగా వుండడంతో సగటు ప్రేక్షకుడికి ఆసక్తికలిగించింది. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ :
కాకినాడ ప్రాంతంలో పి.వి.ఆర్. ది ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు (సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్). రెండో భార్య రాధిక కొడుకు రవి (అరుణ్ విజయ్). తన అన్నదమ్ములపై ఈగవాలనివ్వడు. అదే ఊరిలో సముంద్రం కుటుంబంతో పి.వి.ఆర్ కుటుంబానికి వైర్యం వుంటుంది. సముద్రం కుటుంబానికి చెందిన ట్విన్స్ లో (కేజీఎఫ్ గురుడ రామ్) ఒకడు చనిపోతాడు. ఇందుకు పి.వి.ఆర్. కుటుంబమే కారణంతో పగ పెంచుకుంటాడు ట్విన్స్‌లో మరొకడు లింగం. ఈ క్రమంలో అన్న (సముద్రఖని) కూతురు దేవీ (అమ్ము అభిరామి) ముస్లిం యువకుడితో లేచిపోతుంది. అందుకు కారణం రవినే అని భావించి రవిని సముద్రఖని ఇంటినుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత మరో మలుపు తిరుగుతుంది. అది ఏమిటి? ఆ తర్వాత పరిస్ఙితులు ఎలా మారాయి? అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణః
తెలుగులో లోపించిన ఉమ్మడికుటుంబ కథలు ఈమధ్య తమిళంలో బాగానే వస్తున్నాయి. అన్నీ హిట్ అవుతున్నాయి. ఆ కుటుంబలో వున్న అన్నదమ్ముల మధ్య వున్న స్నేహం, అపోహలు, స్వార్థం, కుట్రలు అన్నీ ఇందులో వున్నాయి. గతంలో కొన్ని సినిమాలకు పోలికగా అనిపించినా ఎక్కడా ఆ ఆలోచను తానివ్వకుండా కథనాన్ని దర్శకుడు హరి చాలా స్పీడ్‌గా లాగించేశాడు. దాంతో తర్వాత సన్నివేశం ఏమవుతుందనే ఉత్కంఠను కలిగిస్తుంది. ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ కూడా బాగున్నాయి. . అరుణ్ విజయ్ సున్నితమైన పాత్ర కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా అరుణ్ విజయ్ భావోద్వేగమైన పాత్రలో బరువైన ఎమోషన్ పండించిన విధానం బాగుంది.
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ క్రిస్టియన్‌గా అమాయకపు పాత్రలో నటించింది. సముద్రఖని కుమార్తె ముస్లింను ప్రేమించడం, ఆ తర్వాత కనిపించకుండా పోవడం వంటి సన్నివేశాలు ఉత్కంట రేకిస్తాయి. ఈ సినిమాలో హిందు, ముస్లిం, క్రిస్టియన్ అనే మూడు మతాలను, అగ్రకులాల పెత్తనాన్ని, ఇతర కులాల్ని తక్కువ చూడడం వంటివి ఇంకా సమసిపోలేదు. కాలం మారిన ఇవి ఇంకా కొందరి స్వార్థంతో ఎలా బతికివున్నాయనేది దర్శకుడు ఆయా పాత్రల ద్వారా చూపించాడు. ఫైనల్‌గా ఏ కులం వాడు ఎవడిని కాపాడతాడు? అనేది ట్విస్ట్ ఇచ్చి కనువిప్పు కలిగేలా చూపించాడు దర్శకుడు. పగతో రలిగిపోతున్న లింగంను రవి చంపే సమయంలో దర్శకుడు ఇచ్చిన ముగింపు ట్విస్ట్ చాలా లాజిక్కుగానూ ఆలోచించేదిలా వుంది.
- ఇటువంటి కథకు పాటలు తక్కువే అయినా ఉన్న పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన యాక్షన్ ఎమోషన్స్ తో బాగానే చూపించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడక్కడ అనవసరమైన సీన్స్ ను ఇరికించడం వల్ల.. సినిమాలోని సీరియస్ నెస్ సినిమా ప్లోను డిస్ట్రబ్ అయ్యింది. ఇక యోగిబాబు బ్యాచ్ సన్నివేశాలు ఎంటర్‌టైన్ చేస్తాయి.
దర్శకుడు హరి దర్శకత్వ విషయంలో ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. ఎమోషన్ అండ్ ఫీల్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే ప్రయత్నం చేశాడు.నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. నిర్మాత ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.
ఏనుగు లాంటి వ్యక్తి అండగా వుండే కుటుంబానికి రక్షగా వుంటుందనే లాజిక్కుతో దర్శకుడు టైటిల్ పెట్టాడు. ఓ దశలో స్పీడ్‌గా సాగే సన్నివేశాలు ఎమోషన్స్ సూర్య చిత్రాలను తలపిస్తుంది. మొత్తంగా చూస్తే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తోపాటు కులాలు, మతాలతో మనుషులు వేరుచేయడం అనేది అనాగరికమనే చిన్నపాటి సందేశాన్ని సున్నితంగా చెప్పాడు. ఇదికుటుంబంతో కలిసి చూడతగ్గ సినిమా.