Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబర్ 22న దసరా కానుకగా 'కంచె' విడుదల... బ్రూస్ లీ ఏమవుతుందో...?

Advertiesment
dussehra 2015
, శుక్రవారం, 16 అక్టోబరు 2015 (21:34 IST)
మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటించిన చిత్రం 'కంచె'. ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. బాలీవుడ్‌లో ఇటివలే గబ్బర్ చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.
 
తొలుత నవంబరు 6న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ, అనూహ్యంగా అఖిల్ సినిమా వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే చిత్రం ఫస్ట్ కాపీ రెడీగా ఉండటం, సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికేట్ చేతిలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోటం సులభం అయ్యింది. 
 
కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో సాగే ఒక ప్రేమకథ ఈ కంచె. డైరెక్టర్ క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజమైన వరల్డ్ వార్ 2 గన్స్, ట్యాంక్స్‌తో జార్జియాలో భారీ వ్యయంతో చిత్రీకరించిన వార్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని చిత్ర బృందం చెబుతోంది. 
 
కంచె చిత్రం లోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అధ్భుతంగా రచించారని నిర్మాతలు రాజీవ్ రెడ్డి మరియు జాగర్లమూడి సాయిబాబు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. భారీ వ్యయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న ఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్టను పెంచే చిత్రం అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా రామ్ చరణ్ బ్రూస్ లీ చిత్రం ఈరోజే విడుదలయింది. మరో 5 రోజుల్లో కంచె విడుదలవుతుంది. మరి దసరా బిగ్గెస్ట్ హిట్ ఈ రెండింటిలో ఏది అవుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu