Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బాహుబలి' కౌంట్‌డౌన్‌ స్టార్ట్... టెన్షన్ టెన్షన్... బాహుబలి ప్రివ్యూ (వీడియో)

'బాహుబలి' కౌంట్‌డౌన్‌ స్టార్ట్... టెన్షన్ టెన్షన్... బాహుబలి ప్రివ్యూ (వీడియో)
, గురువారం, 9 జులై 2015 (19:29 IST)
వందలమంది నటీనటులు.. 200 కోట్ల బడ్జెట్‌ (180 అని నిర్మాతలు మొదట్లో చెప్పారు. తర్వాత మార్చారు), 500 రోజుల కాల్షీట్లు (ప్రభాస్‌ 300, రానా 200 రోజులు. అందులోనే అనుష్క, తమన్నా డేట్స్‌). వెయ్యి రోజుల షూటింగ్‌.. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ తారాగణం... హాలీవుడ్‌ టెక్నీషియన్లు.. శోభు యార్లగడ్డ వంటి అసలు నిర్మాత కాకుండా పలువురు ఫైనాన్షియర్ల పెట్టుబడి... వెరసి 'బాహుబలి' సినిమా తయారు. ఈ సినిమాకు ప్రేక్షకుడిచ్చే తీర్పుకు కొద్దిగంటలే వుంది. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ సిక్సర్‌ కొడితే.. మొదటి ఆటకే భలే బాహుబలి అంటాడు. డకౌట్‌ అయితే.. ప్రేక్షకుడు బలి అని మార్చేస్తారు.. ఏం జరిగినా ఇంకొన్ని గంటలే. 
 
చిత్ర పరిశ్రమతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ విడుదల కోసం ఎదురుచూస్తున్న చిత్రమిది. ఒక్కొక్కరికి ఒక్కో ఆసక్తి. నిర్మాతల పరంగా చూస్తే.. ఈ సినిమా ఎంత వసూలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఎంత? మిగతా భాషల్లో, హిందీలో ఆశించిన స్థాయిలో ఆడుతుందా? ఓవర్సీస్‌ కలెక్షన్లు ఏవిధంగా వుంటాయి.. అంటూ వాణిజ్యపరమైన లెక్కలు వేస్తున్నారు.
 
హీరోల విషయానికి వస్తే.. ప్రభాస్‌ ఏ రేంజ్‌కు ఎదుగుతాడన్నది అందర్లో ఉత్కంఠ రేపుతోంది. పైకి అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్లు చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. కానీ.. లోలోపల సహజంగా ఏర్పడే అభద్రతా భావం.. వారిలో టెన్షన్‌ పెంచుతున్నట్లు కన్పిస్తుంది.
 
ఇక దర్శకులయితే.. మరోరకమైన పరిస్థితి.. ఇప్పటికే తెలుగు డైరెక్టర్లలో రాజమౌళి... ఎంతో ఎత్తులో.. అంటే బాహుబలిలో గోమటేశ్వరుడి విగ్రహం అంత ఎత్తు ఎదుగుతాడా? అన్న అనుమానాలున్నాయి. మరోవైపు.. సంగీతం ఆశించిన స్థాయిలో వుండకపోవచ్చని.. కీరవాణి టాలెంట్‌ వున్నా... రెహమాన్‌ పెడితే బాగుండేదేమోనని.. ఇలా ఎవరి అంచనాలు వారికున్నాయి. అయితే అందరూ హాలీవుడ్‌ రేంజ్‌లో వుందనే చెబుతున్నారు.

ప్రమోషన్‌లో సర్వశక్తులూ ఒడ్డాడు
తెలుగులో ఒక్క సినిమా సూపర్‌హిట్‌ అయితే మాగ్జిమమ్‌ 40 నుంచి 50 కోట్లు వసూలు చేస్తుంది. అలాంటిది నాలుగు రెట్లు బడ్జెట్‌తో తయారైన ఈ సినిమాను నిర్మాత రాబట్టాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకు ప్రేక్షకుడిలో ఉత్కంఠ క్రియేట్‌ కావాలి. దీన్ని దర్శకుడు రాజమౌళి చేసేశాడు. ఏడాది నుంచి ఇన్‌డైరెక్ట్‌గా ప్రచారం చేస్తూనే వున్నాడు. ముఖ్యంగా అందుకు సహకరించింది సోషల్‌మీడియా. అందులో రాయడానికి కొలబద్దలు, నియమనిబంధనలు ఏమీ వుండవు.. అదిగో పులి.. ఇదిగో తోక అన్నట్లుగా.. ఏదిపడితే అది రాసేయవచ్చు. దాన్ని ఊరించి ఊరించి... చెబుతుంటే... ఇతర ప్రచార మాధ్యమాలు కూడా.. అది నిజమేనా.. ఇది నిజమేనా? అంటూ రాజమౌళినే ప్రశ్నిస్తుంటే.. ఏమని చెబుతాడు... మీకే వదిలేస్తున్నానంటూ వెల్లడించాడు. 
webdunia
 
అదో న్యూస్‌.. ఇలా పబ్లిసిటీలో పదాకులు తెలిసిన రాజమౌళి.. ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించాలనే ప్లాన్‌లో సర్వశక్తులూ ఒడ్డాడు. సినిమా ఎలా వుంది? అనేది సెకండరీ.. కానీ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకున్నాడు. రాష్ట్రంలో 90 శాతం థియేటర్లను ఆక్యుపై చేశాడు. ఇందుకు సినిమా రంగానికి చెందిన పెద్దలంతా సపోర్ట్‌గా నిలిచారు. యూత్‌ హీరోలైతే... ట్విట్టర్లలో తెగ పొగిడేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. కొందరు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఒకప్పుడు సంక్రాంతికి, దసరాకు.. ఒకే ఒక్క హీరో చిత్రం విడుదలైతే నానా యాగీ చేసే నిర్మాతలు కూడా ఈసారి కిక్కురుమనలేదు.
 
ఈ ప్రచారంలో అన్ని థియేటర్లలో వారం, పదిరోజుల వరకు టిక్కెట్లు ఎగిరిపోయాయి. సినిమా విడుదల కాకముందే హిట్టో, ఫట్టో అనే సంబంధం లేకుండా డబ్బులు మాత్రం వసూలు చేసింది. ఇదే దర్శక నిర్మాతలకు కావాల్సింది. కాగా, విడుదలకు ముందు ఆడియోకు ఇతరత్రా ఏదో సమస్య వస్తే.. వెంటనే అన్ని ప్రచారమాధ్యమాలను పిలిచి, స్వంత ప్రచారానికి 'ఆ నాలుగు' పత్రికలకే పట్టంకట్టిన ఘనత కూడా రాజమౌళిదే. అదేమని అడిగితే... మాట దాటవేసిన ఘనతా ఆయనకే చెల్లు.

ప్లాప్‌లేని రాజమౌళి ట్రాక్‌!
పైరసీ వచ్చాక పెద్ద సినిమాల జీవితకాలం మూడు రోజులే. మాగ్జిమమ్‌ కలెక్షన్లు రాబట్టుకోవాలనేది ఇండస్ట్రీలో బలంగా నాటుకుపోయింది. అందుకని మాగ్జిమమ్‌ థియేటర్లను కబ్జా చేయడమే మార్గంగా చూసుకున్నారు. ప్లస్‌ పాయింట్‌ ఏమంటే.. సినిమాకు ప్రింట్‌ తీయడం అనేది లేకపోవడం. ఎప్పుడైతే శాటిలైట్‌ అయిందో.. ఎన్ని థియేటర్లోనైనా ప్రదర్శించవచ్చు. ఇది చాలా తేలికైంది. ఇదివరకు ప్రింట్‌లు వేయాలంటే ప్రసాద్‌ ల్యాబ్స్‌, రామానాయుడు ల్యాబ్‌, ఫిలింసిటీలలో వేసేవారు. అందుకు మ్యాన్‌ పవర్‌ కావాలి. ఇప్పుడు అవేవీ అక్కర్లేదు. టెక్నాలజీ మారాక తేలిగ్గా మార్కెటింగ్‌ చేసుకోవడం తెలిసినవారి విద్య. దానికోసం హైప్‌ చేస్తుంటారు. 
webdunia
 
మామూలుగా అయితే 50 రోజులు ఆడితేగానీ డబ్బులు రావని నిర్మాతలు గగ్గోలు పెడుతుంటారు. ఈలోగా పైరసీ వస్తే.. జీరోకి ఆదాయం పడిపోతుంది. అందుకే వారంరోజుల్లో పెట్టుబడి వచ్చేయాలి. ఆ తర్వాత అన్నీ లాభాలే. సినిమా బాగోలేదని టాక్‌ వస్తే థియేటర్‌ మెయిన్‌టైన్‌కు సరిపోదు. 50 కోట్లతో సినిమా తీసి వుంటే... దాన్ని మొదటి భాగంగా మార్చారు. రెండోభాగానికి కలిపి 180 అని చెబుతున్నారు. అందుకే వాటిని రాబట్టాలనే వివిధ భాషల్లో డబ్‌ చేశారు. తీసిన సినిమాకన్నా.. ప్లాప్‌లేని రాజమౌళి ట్రాక్‌ రికార్డ్‌ ప్రేక్షకుల్లో క్రేజ్‌ తెచ్చింది. దాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు.

ఇతర నటుల్ని ఇన్‌వాల్వ్‌ చేశారు
ఇందుకు ఇక్కడివారే కాకుండా తమిళ హీరోలు కూడా రాజమౌళిని పొగడ్తల్తో ముంచెత్తారు.. సూర్య 'రాక్షసుడు' చిత్రం ప్రమోషన్‌కు ఇక్కడికి వచ్చి రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు. ఇక హిందీలో రానాకున్న పరిచయంతో కరన్‌జోహార్‌తో టై-అప్‌ కావడంతోపాటు అమితాబ్‌తో నటించాడు కాబట్టి ఆయనకు టీజర్‌ చూపించి మెప్పు పొందేలా చేశాడు. అయితే ఇవన్నీ.. కేవలం ట్రైలర్‌ అనే ముక్క చూసే ముగ్దులవ్వడం విశేషం. ఇదే ముక్క 'రాక్షసుడు'ని చూసి రాజమౌళి తెగ పొగిడాడు. ఫలితం శూన్యం.
webdunia
 
మామూలుగా సినిమా విడుదలకు ముందే పలుచోట్ల ప్రకటనలు హోరెత్తిస్తుంటాయి. పోస్టర్లు పడుతుంటాయి. పేపర్లలో ప్రకటనలు ఇస్తుంటారు. ఇవేవీ లేకుండా వివిధ మాధ్యమాలు ఈ సినిమాను భుజాన మోశాయి. ఇది రాజమౌళికి వరంగా మారింది. పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ వచ్చేసింది. అందుకే ప్రతి పోస్టర్‌ను సోషల్‌ మీడియాలోనే రిలీజ్‌ చేశాడు. దాన్ని వివిధ పత్రికలు, మాధ్యమాలు రీ-ప్రొడ్యూస్‌ చేసి వేసుకున్నాయి.

అతి ప్రచారం ప్రమాదమే
అయితే ఇంతటి పబ్లిసిటీ కొన్ని సందేహాలకు తావిస్తోంది. సినిమాలో దమ్ముంటే ఆడుతాయనేది విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. తెలుగులో ఇంతవరకు అతి ప్రచారం జరిగిన చిత్రాలు విజయఢంకా మోగించిన సందర్భాలు లేవు. ఎన్‌టిఆర్‌. 'నరసింహుడు' చిత్రం అలా జరిగే.. తేడా వచ్చేసరికి.. నిర్మాత హుస్సేన్‌సాగర్‌లో దూకిన వాస్తవం ఇంకా నిర్మాతలకు తెలియంది కాదు. పైగా ఈమధ్యనే ఇంకా మనకళ్ళ ముందే ఇంతకంటే ఎక్కువ హైప్‌ క్రియేట్‌ చేసి, రాజమౌళి చేత కూడా మెచ్చుకోబడిన 'ఐ' సినిమానే ఉదాహరణగా కన్పిస్తుంది. ఆ సినిమా అట్టర్‌ ప్లాప్‌ అయింది. 
webdunia
 
నిర్మాత దాదాపు రోడ్డున పడినంత పనయింది. దీనికి పబ్లిసిటీ మామూలుగా లేదు. అదిగో దసరా, ఇదిగో దీపావళి, అంటూ సంక్రాంతికి వచ్చింది. ట్రైలర్‌ అదుర్‌పాటుగా తీశారు. హాలీవుడ్‌ స్టార్‌ ఆర్నాల్డ్ కూడా వచ్చి మెచ్చుకోవడం మరింత క్రేజ్‌ వచ్చింది. అందుకే ఇంతటి పబ్లిసిటీ కూడా దుష్పలితాలు ఇస్తుందని కొందరు నిర్మాతలు భయపడుతున్నారు. ఇది కాకుండా రజనీ 'లింగ' కూడా అంతో ఇంతో క్రేజ్‌ తెచ్చుకుంది. కానీ చివరికి నిర్మాతల్ని అప్పుల్లో ముంచింది. బయ్యర్లు నిరాహార దీక్షలు చేసే స్థాయికి చేరింది.
 
దర్శకుడిగా ఇంతవరకు ప్లాప్‌ లేని రాజమౌళికి ఎప్పుడూ ఇలాగే వుంటుందనే గ్యారంటీ లేదు. ఈ సినిమాతో ఆయనకు పోయింది ఏమీలేదు. అయితే ఓ సెంటిమెంట్‌ మాత్రం నటీనటులకు ఉంది. రాజమౌళి సినిమాలో నటించిన ప్రతి హీరోకు కొంతకాలం ప్లాప్‌లు వెంటాడుతుంటాయి. మగధీర తీశాక ఆయన పెద్ద హీరోతో చేయలేదు. సునీల్‌తో మర్యాద రామన్న తీశాడు. నానితో ఈగ తీశాడు. కారణం ఏదైనా.. దర్శకుడిగా ఆయన ఎవరితోనైనా చేస్తాడు. కానీ హీరోలతో సినిమాలు ఎవరైనా చేయాలంటే భయపడతారు. ఒకవేళ సినిమా తేడా వస్తే.. ఆ ఎఫెక్ట్‌.. బయ్యర్లపై పడుతుంది. ఇప్పటికే పలువురు ఫైనాన్షియర్లు ఈ సినిమాకు జమ చేశారు.

ఇతర హీరోలపై ప్రభావం
ఈ చిత్ర ప్రభావం ఇతర హీరోలపై పడుతుంది. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, జూ.ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌ వంటివారి ఫ్యాన్స్‌ ఊరుకుంటారా... తెలుగులో రికార్డుల గోల ఎప్పటి నుంచో వుంది. పైకి అందరం సమానం అన్నా... ఎవరి సినిమాలకు ఆ సినిమా ఫ్యాన్స్‌ హడావుడి చేస్తుంటారు. రేపు.. ఆ సినిమాను బీట్‌ చేయాలని.. మరో హీరో ఫ్యాన్‌ భావిస్తాడు. ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్‌ మిగిలినవారికి రాకపోవచ్చు. రాజమౌళికి వచ్చిన ఖ్యాతి మరొరకరికి దక్కకపోవచ్చు. పోటీతత్వం వుండే ఈ ఫీల్డులో ఇలాంటివి ఆరోగ్యకరమైనవి కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా బాహుబలి కోసం మరికొన్ని గంటలు వేచి ఉందాం... చూద్దాం ఈ వీడియోను... క్లిక్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu