Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశాల్లో బతుకమ్మ సంబరాలు!

Advertiesment
విదేశాల్లో బతుకమ్మ సంబరాలు!
, సోమవారం, 29 సెప్టెంబరు 2008 (18:11 IST)
తెలంగాణా సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ సంబరాలను విదేశాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని పూల పండుగ (బతుకమ్మ) జరుపుకోవటానికి సిద్ధమవుతారు.

ఈ వారం రోజుల్లో ఆడపడుచులంతా రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. దసరాకి రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను రాష్ట్రంలోనే మాత్రమే కాకుండా న్యూజెర్సీ, కెనడా, చికాగో, డల్లాస్, టెక్సాస్ వంటి విదేశాల్లోనూ జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా డల్లాస్‌, వాషింగ్టన్‌, అస్టిన్, బ్లూమింగ్‌టన్, డెట్రాయిట్‌లలో అక్టోబర్ నాలుగోతేదీన ఈ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. అదేవిధంగా అట్లాంటాలో అక్టోబర్ ఐదో తేదీన జరుపుకోనున్నారు.

రాష్ట్రంలో బతుకమ్మ...
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణలోని ఒక్కో జిల్లా కేంద్రంలో ఒక్కోరోజు ఘనంగా నిర్వహించనున్నట్లు జాగృతి సంస్థ వెల్లడించింది. ఈ విషయమై తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడుతూ... ఈ పండుగను వైభవంగా జరుపనున్నట్లు తెలిపారు. సోమవారం (నేడు) వరంగల్ నగరంలో బతుకమ్మ సంబరాలను ప్రారంభించి అక్టోబర్ ఏడో తేదీ హైదరాబాద్ లుంబినీ పార్కులో ముగిస్తామని తెలిపారు.

సెప్టెంబర్ 30వ తేదీన కరీం నగర్‌లో, అక్టోబర్ ఒకటిన సంగారెడ్డిలో, 2న ఆదిలాబాద్, 3న కామారెడ్డి (నిజామాబాద్), 4న మహబూబ్‌నగర్, 5న నల్గొండ, 6న ఖమ్మం వంటి పట్టణాల్లో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. 7వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు లుంబినీ పార్కులో నిర్వహించే సంబరాల్లో జంటనగరాల్లోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారని కేసీఆర్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu