రచనల దొంగతనం : "విన్‌ఫ్రే"పై 50 లక్షల కోట్ల దావా..!!
ఇతరుల రచనల్లోని భావాలను దొంగిలించి, అవి తనవిగా చెప్పుకున్న "టాక్ షో" మహారాణి "ఆప్రావిన్‌ఫ్రే"పై అమెరికాలో దావా ఒకటి దాఖలైంది. 1.2 ట్రిలియన్ డాలర్ల (దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు) మొత్తాన్ని విన్‌ఫ్రే తనకు చెల్లించి తీరాలని.. డామన్ లాయిడ్ గొఫె అనే న్యూయార్క్ రచయిత ఒకరు వాషింగ్టన్ కోర్టులో కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వస్తే... తాను రచించిన "ఎ టోమ్ ఆఫ్ పోయమ్స్" అనే గ్రంథం నుండి కొన్ని భావాలను దొంగిలించిన విన్‌ఫ్రే, ఆమె రాసిన "పీస్ ఆఫ్ మై సోల్" అనే రచనలో వాడుకున్నారని గొఫె ఆరోపించారు. ఈ విషయాన్ని విన్‌ఫ్రే గత సంవత్సరంలోనే అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.ఇదిలా ఉంటే... తన రచనల్లో భావాలను పొందుపరచిన విన్‌ఫ్రే పుస్తకాలు దాదాపు 65 కోట్లు అమ్ముడుబోయాయని, ఒక్కో పుస్తకం 20 డాలర్ల (వెయ్యి రూపాయలు) ఖరీదు చేసిందని గొఫె వివరించారు. కాబట్టి, ఆమె రచనల్లో తన భావాలు వాడుకున్నందుకుగానూ తనకు నష్టపరిహారంగా 1.2 ట్రిలియన్ డాలర్లను ఇచ్చితీరాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు.