విఖ్యాత సంగీత కళాకారుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల పురస్కారం ప్రదానం చేశారు. మంగళవారం రాత్రి విశాఖ పట్నం కళాభారతి ఆడిటోరియంలో కాసు వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా కొప్పరపు కవుల పురస్కార ఫలకంతో పాటు రూ22,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రం ఆయనకు బహుకరించి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పద్మవిభూషణ్ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ విద్యాపరంగా ఎలాంటి అర్హతలు లేకున్నా దైవం ప్రసాదించిన సంగీత విద్యతో తనకు జీవితంలో ఎన్నో పురస్కారాలు, బిరుదులు లభించాయని, వాగ్దేవికి తానెంతో రుణపడి ఉన్నానని పేర్కొన్నారు.
సభా కార్యక్రమాలలో ఎన్నటికీ పాడకూడదని తాను గతంలో విధించుకున్న నిబంధనను పక్కనబెట్టిన మంగళంపల్లి వచనం తరహాలో ఉండే ... కమల దళాయిత లోచనాలవే.. కర్మలనెల్ల కనిపెట్టునవే. సమరస భావన.. సమతాజీవన.. కమనీయ గాన... కవితాప్రదమౌ.. అన్న గీతాన్ని ఆలాపించి అందర్నీ రంజింపజేశారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన జరిగేలా చూడాలని, ఇందుకోసం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు చెప్పారు.