నార్ల వెంకటేశ్వరరావు.. తెలుగు భాషకు నుడికారం ఇచ్చిన గొప్ప వ్యక్తి, మానవతా వాది అని... జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి కొనియాడారు. విశాఖలో పురిపండా అప్పలస్వామి విగ్రహావిష్కరణ, నార్ల శత జయంతి సభలో పాల్గొన్న సినారె తెలుగుభాష సాంస్కృతిక ప్రచార యాత్ర సభను నిర్వహించారు.
మంత్రి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సినారె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినారె మాట్లాడుతూ... పండితునికి, పామరునికి తెలుగు భాష అర్థమయ్యే రీతిలో నార్ల సంపాదకీయాలు, రచనలు చేశారని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికలలో సంపాదకుడిగా సమగ్ర భాషా వికాసానికి నార్ల చేసిన కృషి మరువరానిదన్నారు.
మహాకవి వేమన, గురజాడ, కందుకూరి వీరేశలింగం పంతులు తదితర మహనీయులపై కూడా నార్ల ఆంగ్ల భాషలో వ్యాసాలు రాశారని సినారె తెలిపారు. ఇకపోతే... పురిపండా అప్పలస్వామి తొలినాటి అభ్యుదయ కవుల్లో ఒకరని, ఆయన విగ్రహాన్ని సాగర తీరంలో ఆవిష్కరించడంతో చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
మంత్రి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ... తెలుగు భాష వ్యాప్తికి అవిరళ కృషి చేసిన గొప్ప మానవతా వాది నార్ల అని కొనియాడారు. ఆయన కాలంలో పత్రికలు వ్యావహారిక భాషను వాడితే, నేటి పత్రికలు ఆంగ్ల పదాలను వాడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సాంస్కృతిక ప్రచార యాత్రతో తెలుగు భాష విస్తృతం కావాలని ఆయన ఆకాంక్షించారు.