సుప్రసిద్ధ కూచిపూడి నాట్యాన్ని దశలవారీగా వ్యాపింపచేసే దిశగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూచిపూడి నాట్యపురస్కారాన్ని అందజేసే అంశంపై ప్రభుత్వం యోచిస్తోందని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.
650 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన కూచిపూడి విశ్వవ్యాప్తమై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించడం గర్వించదగినదని మంత్రి చెప్పారు. తెలుగువారికి లభించిన సాంస్కృతిక సంపదలో కూచిపూడి ఒకటని మంత్రి బుద్ధప్రసాద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కూచిపూడిని ఆన్లైన్ ద్వారా విశ్వవ్యాపితం చేసి అభ్యసిస్తే మరింత ప్రాచుర్యం చెందుతుందని మంత్రి ఆకాంక్షించారు.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కూచిపూడి శ్రీ సిద్ధేంద్రయోగి కళాపీఠంలో నాట్యోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభవేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి బుద్ధప్రసాద్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్ళబండి కవితాప్రసాద్ మాట్లాడుతూ... మసకబారుతున్న తెలుగుభాషకు వెలుగు తెచ్చిన ఘనత తెలుగు విశ్వవిద్యాలయానిదేనికే దక్కుతుందన్నారు. కూచిపూడీ గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించడం ఆంధ్రులంతా గర్వించదగిన విషయమని కవితా ప్రసాద్ అన్నారు.