అమ్మా, నాన్న లాంటి కమ్మటి పదాలను వదిలేసి మమ్మీ, డాడీ అని పిలుస్తుండే పాశ్చాత్య ఆంగ్ల సంస్కృతిని వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఏబీకే ప్రసాద్ స్పష్టం చేశారు. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించిన తరువాత రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో భాషాపతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏబీకే ప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... మమ్మీ అంటే ఈజిప్టు భాషలో శవం అనే అర్థం ఉందన్న సంగతిని మర్చిపోరాదన్నారు. ఆంగ్లం లేకపోతే బతుకే లేదనే భావనను ప్రస్తుత విద్యా సంస్థలు, విద్యార్థులు భావిస్తున్నారని.. వీరు ఈ భావనను విడనాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన హితవు పలికారు.
తల్లిలాంటి తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలని సూచించిన ఏబీకే ప్రసాద్... రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పౌరులు సక్రమంగా వినియోగించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుభాష కోసం 1996లో చట్టం తెచ్చుకున్న సంగతి తెలుగు ప్రజానీకం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాలని ఆయన సూచించారు.
ఇంకా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కుసుమ కుమారి మాట్లాడుతూ... విద్యాలయం పరిధిలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగే విధంగా తగిన కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశంలో ఇంకా... కళాశాల అధ్యక్షుడు ఆచార్య టి. పుల్లయ్య, రెక్టార్ ఆచార్య నాగేశ్వరరావు తదితరులు కూడా ప్రసంగిస్తూ, తెలుగు భాష గొప్పదనాన్ని వివరించారు.