Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శంకరాభరణం శంకరశాస్త్రి అంటే ఎవరో తెలుసా?

Advertiesment
శంకరాభరణం శంకరశాస్త్రి అంటే ఎవరో తెలుసా?
, గురువారం, 25 జులై 2019 (08:35 IST)
కర్ణాటక సంగీతంలో వీణది విశిష్టమైన స్థానం. పాతకాలపు గొప్ప విద్వాంసులలో కన్నడిగులైన శేషణ్ణ, సుబ్బణ్ణ, దొరెస్వామి అయ్యంగార్‌, తమిళులైన కారైక్కుడి సాంబశివ అయ్యర్‌, ధనమ్మాళ్‌, కుప్పయ్యర్‌, తెలుగువారిలో తూమరాడ సంగమేశ్వరశాస్త్రి, వెంకటరమణదాసు, ఈమని అచ్యుతరామశాస్త్రి, అయ్యగారి సోమేశ్వరరావు తదితరులుండేవారు.
 
తరవాతి తరంలో ఈమని శంకరశాస్త్రి, వాసా కృష్ణమూర్తి, చిట్టిబాబు, పప్పు సోమేశ్వరరావు, అయ్యగారి శ్యామసుందరం మొదలైనవారు వీణలో విశేషమైన కృషి చేశారు. ఇప్పటి తరం వినగలిగిన వీణ విద్వాంసులలో అగ్రస్థానం నిస్సందేహంగా ఈమని శంకరశాస్త్రిగారిదే. దురదృష్టవశాత్తూ ఎక్కువమంది తెలుగువాళ్ళకి సినిమాలో శంకరాభరణం శంకరశాస్త్రి అంటే తెలుస్తుంది కాని ఈమని శంకరశాస్త్రి అంటే తెలియకపోవచ్చు. 
 
 
వీణలో మహామహోపాధ్యాయుడైన ఈమని శంకరశాస్త్రిగారి కచేరీలు విన్నవారికి ఆయన గొప్పదనం ఎటువంటిదో తెలిసినదే. పబ్లిసిటీ దృష్య్టా రవిశంకర్‌ వంటివారిని మించిన కళాకారు లెవరూ లేరని సామాన్యులకు అనిపించడం సహజమేమో కాని వాద్య సంగీతంలో శంకరశాస్త్రిగారితో పోల్చదగిన వ్యక్తులు ఆనాడూ, ఈనాడూ కూడా చాలా తక్కువమందే కనిపిస్తారు. గమక విన్యాసంలోనూ, రాగ ప్రస్తారంలోనూ ఆయనది అద్వితీయమైన ప్రతిభ. 
 
కారణాలేవైనప్పటికీ ఇంత గొప్ప కళాకారుడికి రావలసిన ఖ్యాతిలో వెయ్యోవంతు కూడా లభించలేదనడం అతిశయోక్తి మాత్రం కాదు. ఈమని శంకరశాస్త్రి 1922లో సెప్టెంబర్‌ 23న ద్రాక్షారామంలో జన్మించారు. ఆయన తాతగారైన సుబ్బరాయశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా గొప్ప వీణ విద్వాంసులు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను సితార్‌ లాగా నిలువుగా పట్టుకుని వాయించేవారు. (బాలమురళీకృష్ణ చిన్నవయస్సులో కచేరీ చేస్తున్నప్పటి ఒక ఫొటోలో పక్క వాద్యం వాయించిన కంభంపాటి అక్కాజీరావు ఇదే పద్ధతిలో వీణ పట్టుకోవడం కనిపిస్తుంది) శంకరశాస్త్రి తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నారు. 
 
తన మూడో ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. కాకినాడ పిఠాపురం కాలేజీలో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడుగానే జీవితం ప్రారంభించాడు. 1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది. 
ఆయన 1942-50 మధ్యలో మద్రాసులోని జెమినీ స్టూడియోలో సాలూరు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వంలో అసిస్టెంటుగా పనిచేశారు. ఆ కాలంలోనే చిట్టిబాబు ఆయనకు శిష్యుడయాడు. 
 
1951లో పి.బి.శ్రీనివాస్‌ను సినీ గాయకుడుగా పరిచయం చేసినది శాస్త్రిగారే. చంద్రలేఖ, బాలనాగమ్మ వగైరా సినిమాల తరవాత తరవాత రాజేశ్వరరావు ఆ సంస్థనుంచి తప్పుకున్నారు. 1953 ప్రాంతాల్లో శంకరశాస్త్రి జెమినీలో అనేక సినిమాలకు పనిచేశారు. టైటిల్స్‌లో సంగీతదర్శకుడుగా ఆయన పేరు ఎక్కడైనా వేశారో లేదో కూడా అనుమానమే.
అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారంటే గిట్టని తమిళ గ్రూపు ఒకటి తయారైంది. 
 
జెమినీ స్టూడియోస్‌ అధినేత ఎస్‌.ఎస్‌.వాసన్‌ తదితరులు ప్రతిరంగంలోనూ తెలుగువారిని అణగదొక్కటానికి ప్రయత్నించేవారట. వాసన్‌ మాయలో పడవద్దని శంకరశాస్త్రిగారికి మిత్రులు సలహా ఇచ్చినా ఆయన మొదట్లో పట్టించుకోలేదు. ఆయనది సంగీత ప్రపంచమే తప్ప డొంక తిరుగుడు వ్యవహారం ఉండేది కాదు. అప్పటికే అద్భుతమైన పాండిత్యం ప్రదర్శిస్తున్న శంకరశాస్త్రిగారు కచేరీ లివ్వకుండా జెమినీలో ప్రతిరోజూ సాయంత్రాలు రికార్డింగ్‌ ఏర్పాటు చేసేవారట. 
 
సీతారామ కల్యాణం (రావణుడు వీణ వాయించే ఘట్టం), వెంకటేశ్వర మహత్యం (సరస్వతి “వాచస్పతి” రాగం వాయించే సీను) మొదలైన కొన్ని తెలుగు సినిమాల్లో శాస్త్రిగారి వీణ వినబడుతుంది. 1959లో శాస్త్రిగారు సినిమాల్లో మానుకుని మద్రాసు ఆలిండియా రేడియోలో చేరారు. అక్కడ కూడా ఆయన ప్రతిభ కొందరికి ఇబ్బంది కలిగించడంవల్లనేమో కాని ఆయనకు 1961లో ప్రమోషనిచ్చి ఢిల్లీకి బదిలీ చేసేశారు. దానితో దక్షిణాదిలో ఉన్న ఆయన అభిమానులకు వీణ కాస్తయినా వినే కాస్త అవకాశం తగ్గిపోయింది.
 
ఈమని శంకరశాస్త్రి గారి వీణ శైలి అద్భుతమైనది. ఆయన తన వీణకు ఎలక్ర్టానిక్‌ పికప్‌ వాడేవారు. అందువల్ల తీగలను ఎంత నాజూకుగా మీటినా అతి సున్నితమైన సంగతులు కూడా స్పష్టంగా వినబడేవి. ఆ కారణంగా ఆయన ప్రతిరాగాన్నీ చక్కని గమకాలతో ఎంతో అందంగా వాయించేవారు. ఉస్తాద్‌ విలాయత్‌ఖాన్‌ సితార్‌ మీద గాత్రంలో పలికించినట్టుగా గమకాలను వినిపించడంలో దిట్ట. 
 
ఆ విధంగా విలాయత్‌ఖాన్‌ ప్రవేశపెట్టిన సితార్‌ గాయకీ శైలికి ఎంతో ప్రత్యేకతా, ప్రాముఖ్యతా ఏర్పడింది. అందుకు ఏ మాత్రమూ తీసిపోని పద్ధతిలో ఈమని శంకరశాస్త్రిగారు వీణ వాయించేవారు. శాస్త్రిగారికి విలాయత్‌ఖాన్‌ లాగే తన కచేరీలలో అప్పుడప్పుడూ పాట పాడి వినిపిస్తూ అవే సంగతులను వీణమీద పలికించే అలవాటుండేది. మంత్రపుష్పం వంటివి వాయిస్తున్నప్పుడు “ప్రజా”వంటి పదాలను ఉచ్చరిస్తూ కుడిచేత్తో అందుకు అనుగుణంగా డబుల్‌ మీటు వేసేవారు. 
 
ఇక కుడి చేత్తో ఆయన తీగలను మీటే పద్ధతి కూడా చాలా గొప్పగా ఉండేది. సందర్భాన్నీ, అవసరాన్నీ బట్టి ఆయన తన కుడి చేతి పొజిషన్‌నూ, తీగను మీటే స్థానాన్నీ నాలుగైదు రకాలుగా మార్చేవారు. ఆయన పలికించిన తానం అనితరసాధ్యం. మూడో తీగనూ, నాలుగో తీగనూ బొటనవేలితో మీటుతూ మంద్ర, అనుమంద్ర స్థాయిల్లో స్వరాలను అత్యద్భుతంగా వాయించేవారు. మామూలుగా ఉండే మూడు తాళం తీగలే కాక మరొక రెండు ఏర్పాటు చేసి, వాటిని రాగంలోని స్వరాలకు శ్రుతిచేసి మొత్తం మీద ఒక ఆర్కెస్ర్టావంటి ప్రభావాన్ని కలిగించేవారు. 
 
కేవలం ఒక్క వీణతోనే గానమూర్తి మొదలైన రాగాలను ఎంతో డ్రమటిక్‌గా, పెద్ద సింఫొనీ స్థాయిలో వాయించేవారు. ఈ టెక్నిక్‌ల మాట ఎలా ఉన్నా సంగీతకారుడుగా ఆయనది ఎంతో పరిక్వత చెందిన మేధస్సు. రాగస్వభావాన్ని గంభీరంగా, హుందాగా, ఎటువంటి వెకిలితనమూ లేకుండా వినిపించడం ఆయన ప్రత్యేకత. అలాగని ఆయన కచేరీలో నాటకీయత తక్కువయేది కాదు. 
 
ఎందుకంటే ఏ మాత్రమూ వేగాన్నీ, ఆర్భాటాన్నీ ప్రదర్శించకుండా స్వరకల్పనలో ఎంతో ఉద్వేగాన్నీ, ఆర్తినీ సునాయాసంగా సృష్టించేవారు. తాను పూర్తిగా రాగభావంలో లీనమై, ప్రేక్షకుల ఉనికిని కూడా గమనించకుండానే వారిని సంగీతపు అలలలో ఓలలాడించేవారు. ఆయన కచేరీకి ఎన్నిసార్లు వెళ్ళినా అద్వితీయమైన ఆయన ప్రతిభ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ ఉండేది. 
 
చిన్నప్పటినుంచీ కర్ణాటక, హిందూస్తానీ శైలుల ప్రభావం ఉండడంతో ఆయన సంగీతం అన్ని అందాలనూ పుణికిపుచ్చుకున్నట్టుగా కొనసాగింది. అందుకేనేమో తరవాతి కాలంలో రవిశంకర్‌, హలీమ్‌ జాఫర్‌ఖాన్‌ వంటి సితార్‌ విద్వాంసులతోనూ, గోపాల్‌కృష్ణవంటి విచిత్రవీణ కళాకారులతోనూ జుగల్‌బందీ కచేరీలు చెయ్యడం ఆయనకు సులువుగా సాధ్యమైంది. 
 
సూర్‌దాస్‌ భజనలకూ, ఇతర గీతాలకూ ఆయన పహాడీ మొదలైన హిందూస్తానీ రాగాల్లో మంచి స్వరరచనచేశారు. ఆయన రేడియోలో అనేక గీతాలకు లలిత సంగీతం సమకూర్చారు. అందులో “న జానే క్యా లాచారీ హై” అనే హిందీ పాటను బాలమురళీకృష్ణ గుజరీతోడీ రాగంలో పాడారు. అలాగే దేవులపల్లివారి రచన “ఒదిగిన మనసున పొదిగిన భావము” అనే పాటకు శాస్త్రిగారు మిశ్ర కాఫీ రాగంలో ట్యూన్‌ చేశారు. ఢిల్లీలో రేడియోకి చీఫ్‌ ప్రొడ్యూసర్‌గానూ, నేషనల్‌ ఆర్కెస్ర్టా కంపోజర్‌ కండక్టర్‌గానూ ఆయన ఎన్నో అద్భుతమైన సంగీత రచనలు చేసి వాద్యబృందాన్ని నిర్వహించారు. 
 
వాటిలో శిఖరారోహణం, భ్రమర విన్యాసం, సౌమ్య పురుష మొదలైనవి పేరు పొందాయి. శాస్త్రి తన కచేరీలలో వీణ బుర్రమీద చేత్తో దరువు వేస్తూచిన్న జాజ్‌ పద్ధతి స్వర రచనలనూ వాయించేవారు. మంద్రస్థాయిలో వీణ అచ్చు గిటార్‌లాగే వినబడేది. కదనకుతూహలం రాగంలో రఘువంశ కృతిని ద్వారంవారి పద్ధతిలో వెస్టర్న్‌ కార్డ్‌ విశేషాలను ప్రదర్శిస్తూ వాయించేవారు. వీణమీదా, వాయిస్తున్న సంగీతం మీదా ఆయనకున్న పూర్తి అధికారం స్పష్టంగా తెలుస్తూ ఉండేది. 
 
సంప్రదాయ సంగీతాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకోవడమే కాక వీణ మీద దాన్ని ఏ మాత్రమూ తేడా రాకుండా వినిపించడంలో విజయం సాధించారు. అంతేకాక వీణ మీద ఎన్ని రకాల శబ్దాలు పలికించవచ్చునో రిసెర్చ్‌ చేసి నిరూపించిన అసామాన్య కళాకారుడాయన. ఆయనకు పాత పద్ధతిలో కొన్ని భేషజాలుండేవి. “ఘనంగా ఉంటుందని” కొన్ని కచేరీలలో లాల్గుడి జయరామన్‌, ఎం.ఎస్‌.గోపాలకృష్ణన్‌వంటి వయొలిన్‌ కళాకారులచేత పక్క వాద్యం ఏర్పాటు చేసుకున్నారు. 
 
ఆయనకు వినికిడి తక్కువగా ఉండేది. చిన్నపాటి సర్జరీ అన్నా ఆయనకు భయమేనని పరిచయస్థులు అనేవారు. అందుకని చెవిలో హియరింగ్‌ ఎయిడ్‌ పెట్టుకోవడం, తనకు కనబడేట్టుగా స్టేజి మీద ఎవరిచేతనైనా తాళం వేయించడం వంటివి చేసేవారు. ఆయనకు ఏరోప్లేన్‌ ఎక్కడమంటే భయంగా ఉండేదట. అందుకని విదేశాల నుంచి ఎన్ని ఆహ్వానాలు వచ్చినా చాలా ఏళ్ళపాటు వెళ్ళలేదు. చివరికి 70లలో ఫ్రాన్స్‌కు వెళ్ళి కచేరీలు చేశాక అక్కడివారు తబ్బిబ్బయిపోయి “కాన్సర్ట్‌ ఆఫ్‌ ది సెంచురీ” అని పత్రికల్లో మెచ్చుకున్నారట. 
 
ఆ తరవాత ఆయనయూ.ఎన్‌. హ్యూమన్‌ రైట్స్‌ కాన్ఫరెన్స్‌లో అద్భుతమైన కచేరీ చేశారు. ఆయన పాత 3 నిముషాల రికార్డ్‌ ఒకదాన్లో కురంజి రాగంలోని జావళీ శివ దీక్షా పరురాలనురా, ఖమాచ్‌లో మరుబారి తాళలేనురా అనే జావళీ వాయించారు. ఆ తరవాత విడుదలైన ఈ.పీ.లో తోడి రాగంలో చేసినదెల్ల మరచితివో అనే కీర్తన వాయించారు. చాలా ఏళ్ళ వరకూ ఆయన లాంగ్‌ ప్లే రికార్డు రాలేదు. అందులో గానమూర్తి రాగం అద్భుతంగా వాయించారు. తరవాత కేసెట్లలో తన కుమార్తె కల్యాణితో కలిసి కొన్ని కీర్తనలూ, ఫ్రాన్స్‌లో రిలీజయిన సీ.డీ.లో మరికొన్నీ వాయించారు. 
 
ఆయన తెలుగు జానపదగీతాలను వాయించే పద్ధతి చాలా బావుండేది. వాటిలో కొన్ని కేసెట్‌లో విడుదల కూడా అయాయి. ఆయన వీణ మీద పలికించలేని శబ్దం ఉండదేమో అనిపించేది. వీణ నేర్చుకునే ప్రతి విద్యార్థీ ఆయన రికార్డింగ్‌లు విని తీరాలి.  వ్యక్తిగతంగా ఆయనకు “రాజకీయాలు” తెలియవు. ఆయన శిష్యవర్గంలోనివారూ, ఆయనకు సాటిరాని ఇతర తక్కువరకం వైణికులూ కలిసి ఆయన లాంగ్‌ప్లే రికార్డులు త్వరగా రిలీజ్‌ కాకుండా చెయ్యడం మొదలైన పనులు చేశారు. 
 
చివరకు రికార్డ్ కవర్ల మీద అందమైన బొమ్మలు కూడా వెయ్యనివ్వకుండా అడ్డుతగులుకున్నారట. ఆయనది మంచి ప్రభుత్వోద్యోగం కనక ఆయన డబ్బుకూ, పేరు ప్రతిష్ఠలకూ పాకులాడేవారుకాదు. ఈ రచయిత ఆయనను మద్రాసు రేడియో కేంద్రంలో కలుసుకుని బొంబాయికి ఆహ్వానించడానికి ఎంత ప్రయత్నించినా ఆయన డబ్బు విషయంలో రాజీ పడలేదు. అందుకు అసలు కారణం వేరు. చాలా ఏళ్ళ క్రితం బొంబాయి ఆంధ్రమహాసభలో ఆయన కచేరీకి ఎక్కువమంది హాజరు కాలేదట. 
 
అంతకు ముందు రోజే షణ్ముఖానంద హాలులో జనం నిండిపోయి టికెట్లు దొరకని కొందరు నిరాశ పడ్డారట కూడా. అప్పటి నుంచీ ఆయనకు ప్రవాసాంధ్ర సంఘాలంటే నమ్మకం పోయింది. ఉద్యోగ విరమణ చేశాక కూడా ఆయన ఎమెరిటస్‌ కంపోజర్‌గా కొనసాగారు. 1987 డిసెంబర్‌ 23న గుంటూరు కచేరీ రైలు ప్రయాణంలో కన్నుమూశారు.
ఈమని శంకరశాస్త్రి గారి శిష్యుల్లో ముఖ్యుడు చిట్టిబాబు. చిట్టిబాబు గురువుగారు వాయించే శైలిని చాలావరకూ అభివృద్ధి చేశారు. 
 
తమిళులూ, కన్నడిగులతో పోలిస్తే ఈ శైలిలో కుడి చేతి మీటు చాలా వేగంగానూ, స్పష్టంగానూ వినబడుతుంది. “పులుముడు” సంగీతం ఉండదు. చిట్టిబాబు తన పెళ్ళి కచేరీకి మద్రాసులో గురువుగారినే ఆహ్వానించారు. శాస్త్రిగారి మరొక శిష్యుడు ఆయన మేనల్లుడైన కామశాస్త్రి. మరొక మేనల్లుడు రామశాస్త్రి ఎం.ఎస్‌.శ్రీరాం అనే పేరుతో సినిమాలకు సంగీతం అందించాడు.

శంకరశాస్త్రి చెల్లెలు సరస్వతి రేడియోలో మంచి వీణ ఆర్టిస్టు. ఆయన కుమారుడొకడు మృదంగం నేర్చుకున్నారు. ఇద్దరు కుమార్తెలు వీణ చక్కగా నేర్చుకున్నారు. చివరి అమ్మాయి దేవి గజల్‌ సంగీతం పాడుతుంది. శాస్త్రీయ సంగీతానికే ఆదరణ లేని ఈ రోజుల్లో శంకరశాస్త్రి శైలికి ఎక్కువమంది వారసులు లేరని వాపోవడం అర్థం లేనిదిగా అనిపించవచ్చు. మనకు దక్కిన ఆయన రికార్డింగ్‌లనైనా విని, ఆనందిస్తే చాలు. మనలో సంగీతం నేర్చుకుంటున్నవారు ఆయన నెలకొల్పిన ఉన్నత సంప్రదాయాన్ని కొనసాగించలేకపోతే అది సామూహిక వైఫల్యమే అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది మన రెండో గుండె..!