Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ నగరంలో "దక్షిణ భారత నాటకోత్సవాలు"

విశాఖ నగరంలో
విశాఖపట్నంలో "నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బెంగళూర్ సెంటర్ (ఎన్ఎస్‌డి)" వారి ఆధ్వర్యంలో "దక్షిణ భారత నాటకోత్సవాలు" ఘనంగా కొనసాగుతున్నాయి. ఈనెల ఐదు నుంచి పదవ తేదీ వరకు జరిగే ఈ నాటకోత్సవాలలో దక్షిణ భారత భాషలైన తెలుగు, కన్నడ, మళయాళ నాటకాలను ప్రదర్శించనున్నారు.

ఆదివారం ప్రారంభమైన ఈ నాటకోత్సవాలను ప్రముఖ నటుడు, నాటక ప్రయోక్త చాట్ల శ్రీరాములు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రదేశంలో దక్షిణ నాటకోత్సవాలు ప్రదర్శించటం ఇది మూడోసారి కాగా, విశాఖ నగరంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయని అన్నారు. ఈ ఉత్సవాలకు అతిథిగా రావడంతో తనకు డాక్టరేట్ రావడంకంటే ఎక్కువ ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒకే వేదికపై వివిధ భాషలలో అత్యున్నత నాటకాలను చూసే అవకాశాన్ని ఎన్ఎస్‌డి కల్పించిందనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాములు ఈమేరకు విశాఖ వాసులకు విజ్ఞప్తి చేశారు. తదనంతరం ఎన్ఎస్‌డి ప్రథమ దర్శకుడు దేవేంద్రరాజ్ అంకూర్ మాట్లాడుతూ... 1979లో ఎన్ఎస్‌డి తరపున విశాఖలో నాటకాల వర్కుషాపు‌ను నిర్వహించామని, అప్పుడే ఇక్కడ ప్రతిభావంతులైన కళాకారులున్నట్లు తాము గ్రహించామని తెలిపారు.

కళాభారతిలో ప్రారంభమైన ఈ నాటకోత్సవాల్లో తొలిరోజు ప్రదర్శనగా సురభివారి "మాయాబజార్" నాటకం ప్రేక్షకులను రంజింపజేసింది. శూన్యంలో మేఘాల కదలికల మధ్య నారదునిగా మహతి మీటుతూ ఆలాపనతో వచ్చే మొదటి దృశ్యమే ఆహుతులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ తరువాత అందమైన ఉద్యానవనంలో శశిరేఖ, అభిమన్యులు ఆనందంగా ఆడుతూ, పాడుతూ ఉండే సమయంలో మధ్యలో పావురాలు ఎగురుతూ వెళ్లడం, లేడి గంతులేయడం, ఎగిసిపడే జలపాతం ప్రేక్షకులను మైమరిపింపజేసింది.

Share this Story:

Follow Webdunia telugu