ప్రముఖ కవి, కథా రచయిత జూకంటి జగన్నాథంకు 2008 రావిశాస్త్రి అవార్డును హైదరాబాదులో ప్రదానం చేశారు. కళా సుబ్బారావు కళా వేదికపై రావిశాస్త్రి స్మారక సాహిత్య ట్రస్టు, త్యాగరాయగాన సభ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో రావిశాస్త్రి అవార్డు ప్రదానంతో పాటు జూకంటిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన ఏటుకూరి ప్రసాద్ మాట్లాడుతూ... రావిశాస్త్రి రచనల్లో ఉన్న వ్యంగ్యాన్ని అప్పట్లోగానీ, ఇప్పుడుగానీ ఎవరు కూడా బలంగా పట్టుకోలేక పోతున్నారని అన్నారు. రావిశాస్త్రి కథకులకే కథకుడని అదే కార్యక్రమంలో పాల్గొన్న క్యాప్‌కో ఛైర్మన్ మందడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
అవార్డు గ్రహీత జూకంటి మాట్లాడుతూ.. రాజ్యహింస, ఘర్షణ, అసమానతల ఆవల కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత రచయితలందరిపైనా ఉందని అన్నారు. ఆ తరువాత రావిశాస్త్రి సాహిత్యానికి సంబంధించిన శ్రీపతి, అశోక్ కుమార్ తదితరులు ప్రసంగించారు.