స్తంభాద్రి ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. స్తంభాద్రి సంబరాలకు ప్రధాన వేదికైన తరుణీహట్ ఈ ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ప్రధాన వేదికను శిల్పకళాతోరణం రూపంలో అలంకరిస్తున్నారు. ప్రధాన ద్వారం భద్రాద్రి ఆలయం నమూనాలో తీర్చిదిద్దుతున్నారు.
ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన సినిమా సెట్స్ వేసే కళాకారులు చేపట్టారు. వేదికపై జిల్లాలో పేరొందిన ప్రదేశాలు భద్రాచలం, చింతపల్లి కొంగలు, బౌద్ధస్తూపం, పాపికొండలు వంటి ఫోటోలతో సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
మూడు రోజుల పాటు ( 17,18,19) జరిగే ఈ ఉత్సవాలకు అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. తరుణీ హట్ మొత్తాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రముఖ కళాకారుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుతో ప్రదర్శంచే సౌండ్ అండ్ డ్రామా ప్రదర్శనకు రంగం సిద్ధమౌతోంది.
ప్రముఖ పాప్ సింగర్ స్మిత, ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణిలను ఈ సంబరాలను ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పిల్లల వినోదం కోసం ఎగ్జిబిషన్, మరోవైపు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, తినుబండారాల షాపులు ఏర్పాటవుతున్నాయి.
ఖమ్మం నుంచి తరుణీహట్‌కు వచ్చే దారిలో నాయుడుపేట నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం రహదారికిరువైపులా విద్యుత్తు బల్బులతో వైభవంగా అలంకరించారు. దీంతో రాత్రి సమయంలో ఆ పాత్రం దీపాల వెలుగుతో కళకళలాడుతోంది.