Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గే సెక్స్ తప్పుకాదు... పరస్పరం ఇష్టపడితే ఓకే!!

గే సెక్స్ తప్పుకాదు... పరస్పరం ఇష్టపడితే ఓకే!!
స్వలింగ సంపర్కం ఒక మానసిక రుగ్మత అని ఎంతో కాలం నుంచి ఉన్న భావనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడమే కాక మానవుని లైంగిక ప్రక్రియలో అది మరో కోణమని పేర్కొంది. పరస్పర అంగీకారంతో వయోజనులు పాల్గొనే స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనని వెల్లడించింది. 

స్వలింగ సంపర్కం ఒక వ్యాధి కానీ, మానసిక రుగ్మత కానీ కాదని వైద్యపరంగా, మనోవైజ్ఞానిక శాస్త్రపరంగా దాదాపుగా ఏకాభిప్రాయం ఉంది. మానవ లైంగిక ప్రక్రియలో అది మరో కోణం మాత్రమేనని ప్రధాన న్యాయమూర్తి ఎపి షా, న్యాయమూర్తి ఎస్‌. మురళీధర్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇద్దరు వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం పీనల్‌ కోడ్‌ పరిధిలోకి రాదని చెబుతూ ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కుల హక్కులకోసంపోరాడుతున్న వారి వాదనలకు అనుమతినిచ్చింది.

స్వలింగ సంపర్క చర్యల్ని నేరపూరితమైనవిగా పేర్కొనరాదని కోరుతూ స్వలింగ సంపర్కులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్వలింగ సంపర్కులైన పురుషులు వివక్షకు గురవుతున్నారని, సమాజం వారిని కళంకితులుగా, తప్పు చేసిన వారిగా చూస్తూ వివక్షకు గురౌతున్నట్లు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీంతో కోర్టు వారి వాదనలను విన్న తర్వాత 105 పేజీల తీర్పును వెలువరించింది.

తీర్పులోని ప్రధానాంశాలు

** పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య సాగే స్వలింగ సంపర్కాన్ని నేరమని భారతీయ శిక్షా స్మృతిలోని (ఐపిసి) 377వ సెక్షన్‌ పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది.

** మైనర్లతో వారికిష్టం లేకుండా స్వలింగ సంపర్కానికి పాల్పడడంపై పీనల్‌ కోడ్‌ నిషేధం కొనసాగుతుంది.

** పరిపూర్ణ వ్యక్తిగా స్వలింగ సంపర్కునికి ఉన్న హక్కును సెక్షన్‌ 377 నిరాకరిస్తోంది.

** 18 ఏళ్లు, ఆపై వయస్కులెవరైనా వయోజనుల కిందికే వస్తారు.

** ఒకరికొకరు ఇష్టపడితే వారి మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదు.

** లైంగికపరంగా వివక్ష చూపడం వ్యక్తిగత గౌరవానికి, మనుషులంతా ఒక్కటే అనే భావనకు వ్యతిరేకం.

** స్వలింగ సంపర్కం నైతిక విరుద్ధమని పేర్కొంటూ సమాజంలో ఒక వర్గాన్ని చట్టంలోని ఒక సెక్షన్‌ నేరస్థులుగా చిత్రీకరించడం రాజ్యాంగం కల్పించిన సమాన హక్కుకు విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.

** ఐపిసిలోని సెక్షన్‌ 377 రాజ్యాంగ విలువలకు, మనిషి గౌరవమర్యాదలకు విరుద్ధంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu