మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు ఆయన సతీమణి ఉపాసన తేరుకోలేని షాకిచ్చింది. చెర్రీకి తెలియకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ ట్వీట్ చేసింది. ఇందులో మోడీపై సుతిమెత్తగా విమర్శలు గుప్పించింది. ఇది వివాదం కావడంతో చెర్రీ దృష్టికి వెళ్లింది. దీంతో భార్య ఉపాసన చేసిన పనికి ఆమెను నిలదీసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఇంతకీ ఈ గొడవ ఏంటో తెలుసుకుందాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గాంధీ 150వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ జయంత్యుత్సవాలకి సంబంధించిన కార్యక్రమాల గురించి చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, రకుల్‌లతో పాటు పలువురు ప్రముఖులని తన ఇంటికి ఆహ్వానించారు.
అయితే దక్షిణాది నుండి ప్రముఖ నిర్మాత దిల్ రాజు మినహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమల నుంచి ఏ సెలబ్రిటీకి ఆహ్వానం అందలేదు. దీనిపై రాం చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ వేదికగా మోడీకి సున్నితంగా ట్వీట్ పెట్టారు. ఈ విషయం చెర్రీ దృష్టికి ఆలస్యంగా వచ్చింది.
దీంతో ఆయన స్పందించారు. ఉపాసన మోడీగారిని ఎక్కడ విమర్శించలేదు. ఎంతో మర్యాదగా తన బాధని వ్యక్తం చేసింది. నటి ఖుష్బూ దీనిని మరో లెవల్‌కి తీసుకెళ్ళారు. నిజానికి ఉపాసన ట్వీట్ విషయం నాకు తర్వాత ఎప్పటికో తెలిసింది. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని ఉపాసనని అడగగా, చెబితే నువ్వు వద్దంటావని చెప్పకుండా చేశానని అంది అంటూ చెర్రీ వివరణ ఇచ్చుకున్నాడు.