Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కట్టప్ప ఊహ నుంచే బాహుబలికి బీజం పడిందా? అవునంటున్న బాహుబలి రచయిత

‘బాహుబలి’ సృష్టికర్త... విజయేంద్రప్రసాద్‌. దర్శకుడిగా రాజమౌళి అప్రతిహత విజయ యాత్రకు మూలం విజయేంద్రుడి కథలే. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కట్టప్ప పాత్ర ఎలా తట్టిది అనే విషయమై తొలిసారిగ

Advertiesment
కట్టప్ప ఊహ నుంచే బాహుబలికి బీజం పడిందా? అవునంటున్న బాహుబలి రచయిత
హైదరాబాద్ , ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (10:26 IST)
‘బాహుబలి’ సృష్టికర్త... విజయేంద్రప్రసాద్‌. దర్శకుడిగా రాజమౌళి అప్రతిహత విజయ యాత్రకు మూలం విజయేంద్రుడి కథలే. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కట్టప్ప పాత్ర ఎలా తట్టిది అనే విషయమై తొలిసారిగా మీడియాతో పంచుకున్నారు. అసలు బాహుబలి సినిమాకు మూలం కట్టప్పే అనేశారు. ముందుగా కట్టప్ప పాత్రను ఊహించుకుని దాన్ని రాజమౌళికి చెబితే చాలా బాగుందని, దీని ఆధారంగానే మిగిలిన పాత్రలు అల్లుకుందాం అని  చెప్పాడట. ఆ తర్వాత శివగామి, ఆ తర్వాత బాహుబలి.. ఇలా ముందు పాత్రల్ని సృష్టించుకుని సన్నివేశాలు అల్లి కలిపితే  కథ పూర్తయింది అన్నారు విజయేంద్ర ప్రసాద్. కట్టప్పకు మహాభారతంలోని భీష్ముడే ప్రేరణ అన్నారాయన. తన ఊహలోంచి కట్టప్ప పుట్టుకొచ్చిన వైనం గురించి ఆయన మాటల్లోనే విందాం.
 
కట్టప్ప పాత్ర నుంచి ‘బాహుబలి’ ఆలోచన మొదలైంది. కట్టప్ప శక్తిమంతుడు. ముసలివాడు. పిల్లలకు యుద్ధ విద్యలు నేర్పిస్తుంటాడు. ఓరోజు కట్టప్ప దగ్గరకు ఓ విదేశీయుడు వస్తాడు. ‘ఇంత గొప్పగా యుద్ధం చేస్తున్నారు... నేనింత వరకూ మీలాంటి వీరుడ్ని చూడలేదు’ అని నమస్కరిస్తాడు. ‘నాకంటే గొప్ప వీరుడు మరొకడు ఉన్నాడు. అతని పేరు బాహుబలి. అతన్ని యుద్ధంలో ఎవ్వరూ గెలవలేరు..’ అని ‘బాహుబలి’ కథ చెబుతాడు కట్టప్ప. కథంతా విని ‘అతన్ని చూడాలని ఉంది. నాకోసారి చూపిస్తారా’ అని విదేశీయుడు అడిగితే ‘ఇప్పుడతను లేడు. చనిపోయాడు’ అని సమాధానమిస్తాడు. ‘అంత వీరుడూ శూరుడూ అన్నారు, ఎలా చనిపోయాడు’ అని ఆశ్చర్యపోతాడు విదేశీయుడు. ‘కత్తిపోటు కంటే బలమైనది వెన్నుపోటు. నేనే అతన్ని పొడిచి చంపేశా’ అని కట్టప్ప తన తప్పు ఒప్పుకొంటాడు. ఈ సన్నివేశాన్ని రాజమౌళికి చెప్పా. ‘బాగుంది... దీని ఆధారంగా మిగిలిన పాత్రలు అల్లుకొందాం’ అన్నాడు. ఆ తరవాత శివగామి పాత్ర పుట్టింది. తరవాత... బాహుబలి. ముందు పాత్రల్ని సృష్టించుకొని, కొన్ని సన్నివేశాలు అల్లుకొన్నాం. అలా.. అలా కథ పూర్తయింది.
 
శివగామి పాత్రని చాలా గొప్పగా చూపించారు. కానీ చెప్పుడు మాటలు విని బాహుబలిని చంపమని కట్టప్పని ఆదేశిస్తుంది. అలాంటప్పుడు ఆ పాత్ర ఔన్నత్యం దెబ్బ తినలేదా అని అడిగిన ప్రశ్నకు అదే మనిషి బలహీనత అంటున్నారు విజయేంద్ర ప్రసాద్. చెప్పుడు మాటలు వినడం మానవ సహజం. కైక రాముడ్ని ఎంత ప్రేమించింది కొడుకు కంటే ఎక్కువగా చూసుకొంది. కానీ తానూ చెప్పుడు మాటలు విని రాముడ్ని అడవులకు పంపింది. శివగామి కూడా అంతే అన్నారాయన.
 
‘బాహుబలి’ని ఎవరైనా మహాభారతంతో పోలిస్తే గర్వపడతా. నిజంగానే ఆ పోలికలు కనిపిస్తాయి. కట్టప్పలో ఓ భీష్ముడు ఉన్నాడు. తప్పని తెలిసినా కౌరవుల పక్షాన పోరాడాడు. శివగామిలో కుంతి, ద్రౌపది కనిపిస్తారు. భళ్లాలదేవలో ఓ దుర్యోధనుడు, బిజ్జలదేవలో శకుని ఉన్నారు. అయితే కావాలని రాసినవి కావు. తెలియకుండానే ఆ ప్రభావం పడిపోయింది.
 
‘బాహుబలి’లో జలపాతం చూపించాలన్న ఆలోచన రాజమౌళిదే. శివలింగం ఎత్తుకెళ్లే సన్నివేశం కూడా రాజమౌళి కల్పనే. ఇవి నా కథలో లేవు. యుద్ధ సన్నివేశాలన్నీ తనే రాసుకొన్నాడు. డ్రామా వరకూ నేను చూసుకొంటా, విజువల్‌ పరంగా ఆ సన్నివేశాన్ని తాను తీర్చిదిద్దుతాడు.
 
నిజానికి సినిమా అనేది ఇలానే ఉండాలి. మిగిలిన సినిమాలు ‘బాహుబలి’ కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి, ‘బాహుబలి’ గొప్పగా కనిపిస్తోంది. కథ, పాత్రలు, పాత్ర చిత్రణ, సంగీతం.. ఇవన్నీ సమపాళ్లలో ఉండాలి. పాత్రకు ఓ పట్టుక, ఎదుగుదల, ముగింపు ఇవన్నీ ఇవ్వాల్సిందే. మన ఖర్మ ఏంటంటే కథానాయకుడు, నాయిక పాత్రల గురించి తప్ప మనమేం పట్టించుకోం. మిగిలిన పాత్రలు గోడకు కొట్టిన బొమ్మల్లా జీవం లేకుండా ఉంటాయి. గతంలో విజయా వారి సినిమాల్లో ప్రతీ పాత్ర గొప్పగా కనిపించేది. ఆ ఆ స్థాయి రాను రాను తగ్గిపోయింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సీన్‌కు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి.. 'బాహుబలి' స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్