బలవన్మరణానికి పాల్పడిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఎట్టకేలకు స్పందించారు. తాను, సుశాంత్ కలిసి ఒక యేడాది పాటు సహజీవనం చేసినట్టు చెప్పారు. అయితే, ఇపుడు తనను అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. అంతేనా.. సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను పాట్నా నుంచి ముంబైకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో రియా చక్రవర్తి ఓ పిటిషన్ దాఖలు చేసింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును బీహార్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని పిటిషన్ వేసింది.
ఇందులో ఆమె ఆసక్తికర విషయాలు తెలిపింది. గత యేడాది కాలంగా తామిద్దరం సహజీవనం చేస్తున్నామని ఆమె చెప్పింది. గత నెల 8న సుశాంత్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు ఆమె తెలిపింది. కుంగుబాటుతో బాధ పడుతున్న సుశాంత్ మందులు వాడేవాడని చెప్పింది.
గత నెల బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని చెప్పింది. సుశాంత్ మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె చెప్పింది. ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఇప్పటికే తాను ఫిర్యాదు చేశానని గుర్తుచేసింది.
సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే తన వాంగ్మూలం నమోదు చేశారని, అయినప్పటికీ పాట్నాలోనూ కేసు నమోదు కావడం తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సుశాంత్ తండ్రికి బీహార్‌లో పలుకుబడి ఉందని, దీంతో కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పింది. ఈ కేసును మంబైకి బదిలీ చేయాలని కోరింది.