'బ్రహ్మీ అవమానించేలా.. నేను వాడిని ఇరికించే సీన్లు కావాలన్నారు' : వినాయక్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని వివి వినాయక్ దక్కించుకున్నారు. ఈ చిత్రానికి ఎంతోమంది దర్శకుల పేర్లను పరిశీలించినప్పటికీ.. చివరకు ఠాగూర్ దర్శకుడు వినాయక్‌ను వ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని వివి వినాయక్ దక్కించుకున్నారు. ఈ చిత్రానికి ఎంతోమంది దర్శకుల పేర్లను పరిశీలించినప్పటికీ.. చివరకు ఠాగూర్ దర్శకుడు వినాయక్‌ను వరించింది. ఈ ఛాన్స్ రావడం ఓ అదృష్టంగా భావిస్తున్నట్టు వినాయక్ చెప్పారు. ఈ చిత్రం గురించిన విశేషాలను వినాయక్ వెల్లడించాడు.
ఓ రోజున ‘‘ఒక రోజు అన్నయ్య ఫోన్ చేసి, వినయ్ ఒకసారి రా అంటే వెళ్లాను. నేను వెళ్లాక ‘కత్తి చూశావా నువ్వు’ అన్నారు. మామూలుగా చూశాను కానీ, అంత పరిశీలనగా చూడలేదన్నయ్యా అన్నా. ‘ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని చూసి, నీ అభిప్రాయం చెప్పు అన్నారు. పది రోజుల తర్వాత నోట్స్ రాసుకుంటూ చూశా. అది చూశాక మేజర్‌గా నాకు అనిపించింది.. కామెడీ బాగా ఉండాలి, తర్వాత పాటలు మంచిగా ఉండాలి అని అనుకుని స్క్రిప్ట్ రాసుకుని వెళ్లి వివరించాను. ఈ సినిమా అయితే మీకు ఫెంటాస్టిక్‌గా ఉంటుందన్నయ్యా అని చెప్పా. పూర్తిగా మెసేజ్ చెప్పినట్టు కాకుండా.. అలాగని ఏమీ లేకుండా చేస్తే మీ స్టేచర్‌కు కరెక్ట్ కాదు... అదంతా ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ.. నేను రాసుకున్నా నోట్స్ అంతా చెప్పా. చెప్పగానే అన్నయ్య చాలా ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నారు.
తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావుగారితో కూర్చుని మేము అనుకున్న స్క్రిప్ట్‌ను ఒక ఆర్డర్‌లో సెట్ చేసి మళ్లీ అన్నయ్యకు వివరించాను. ఒక సినిమా చూస్తే ఎలాగా ఉంటుందో అలా స్టోరీని నెరేట్ చేశాను. అన్నయ్య లేచి నన్ను హగ్ చేసుకుని ఫెంటాస్టిక్‌గా ఉందని చెప్పారు. అది అయ్యాక రెండుమూడు రోజుల తర్వాత ‘వినయ్ నాకు బ్రహ్మానందం కావాలి’ అని అన్నారు. దీంట్లోకి బ్రహ్మానందం పాత్ర ఎలా వస్తుంది అని నేను అనుకుంటుంటే.. ‘వాడు ఏదైనా నన్ను అనుమానించేలాగ, వాడిని నేను ఇరికించేలాగ ఏదైనా వస్తే బాగుంటుందేమో చూడు’ అని చిరంజీవిగారే సూచించారు.
అప్పడు మళ్లీ ఒక ట్రాక్‌ను పక్కన పెట్టి, బ్రహ్మానందాన్ని ఎలాగోలా ఇరికించేశాం. హీరోయిన్స్ విషయంలో నేను నెరేషన్ ఇచ్చినప్పుడు అనుష్క, కాజల్ అని ఇచ్చా. తర్వాత బ్రహ్మానందాన్ని కొత్తగా అనుకున్నాక సింగిల్ హీరోయిన్ అయింది. తర్వాత ఇంక అనుష్క బిజీ అయిపోయింది. కాజల్ నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్‌ను కూడా సజెస్ట్ చేశారు కానీ, నేను వద్దన్నాను. అయితే కాజల్.. లేదంటే అనుష్క అని ఫిక్సయ్యా. ఫైనల్‌గా కాజల్ ఓకే అయింది.’’ అని వినాయక్ చెప్పారు.