వారివల్ల నా తండ్రి భిక్షమెత్తాడు.. ఆ పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు : విశాల్
కొందరు నా తండ్రి భిక్షమెత్తుకునేలా చేశారు... అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదని తమిళ హీరో విశాల్ అన్నారు. ఎన్నో సినిమాలను నిర్మించిన తన తండ్రి చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.
కొందరు నా తండ్రి భిక్షమెత్తుకునేలా చేశారు... అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదని తమిళ హీరో విశాల్ అన్నారు. ఎన్నో సినిమాలను నిర్మించిన తన తండ్రి చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ చిత్రాన్ని విడుదల చేయాలంటే నిర్మాతల సంఘం వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. నిర్మాతల సంఘానికి తాను పోటీ చేస్తుండటానికి ఇదే ప్రధాన కారణమన్నారు. నిర్మాతల మండలిలోని సమస్యలను తీర్చడానికి తాను అవిశ్రాంతంగా కృషి చేస్తానని తెలిపాడు.
త్వరలో జరగనున్న తమిళ సినీ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి విశాల్ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ యంగ్ హీరో వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామన్నారు. ఏప్రిల్‌లో సంఘం భవన నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. నిర్మాతల సమస్యలను తీర్చడానికే నిర్మాతల సంఘం ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని చెప్పాడు.
కాగా, విశాల్ చేసిన వ్యాఖ్యలపై కబాలి నిర్మాత కలైపులి ఎస్.థాను మండిపడ్డారు. ‘సినిమా తీయని వాళ్లంతా నిర్మాతల సంఘం నాయకులు కావాలని పేరాశపడుతున్నా రంటూ’ థానుతో పాటు సినీ నిర్మాతలు రాధాకృష్ణన్, జేఎస్కే రితీష్‌కుమార్, టి. శివా, పీఎల్ తేనప్పన్, శివశక్తిపాండియన్, అళగన్ తమిళ్‌మణి, సురేశ కామాక్షి, కె.రాజన్, మంగై హరిరాజన్ తదితరులు మండిపడ్డారు. నటుడు విశాల్‌కు ఉన్నట్టుండి రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆశ కలిగినట్లుందని, కనుకనే ఆయన నడిగర్ సంఘాన్ని, నిర్మాతల సంఘాన్ని తన ఆశను నెరవేర్చుకునేందుకు వాడుకోవాలని పథకం వేసుకున్నారని చెప్పారు.
సుమారు 4 వేల మంది సభ్యులున్న నడిగర్ సంఘం బాగోగులు విడిచిపెట్టి 1500 మంది సభ్యులున్న నిర్మాతల సంఘంపై కన్నేశాడని విమర్శించారు. అన్నింటికంటే ముందు విశాల్‌ను హీరోగా పెట్టి సినిమాలు తీసి ఆస్తిపాస్తులతోపాటు సర్వస్వం కోల్పోయిన నిర్మాతలను కాపాడాలని ఆయన సలహా ఇచ్చారు. విశాల్ వల్ల ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లుసైతం నష్టపోయారని అన్నారు. నిర్మాతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విశాలపై నడిగర్ సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.