టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు పెనుప్రమాదం తప్పింది. తన కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన కారు ప్రమాదానికి గురైనప్పటికీ తనతో పాటు ఉన్నవారంతా క్షేమంగా ఉన్నారని స్పష్టంచేశారు.
ఇదే అంశంపై ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ, "నాకేం కాలేదు. అంతా బాగానే వుంది. మా కారుకు దెబ్బ తగిలింది. కానీ మేమంతా క్షేమంగా ఉన్నాం. ఇంటికి తిరిగొచ్చే ముందు జిమ్‌లో స్ట్రెంగ్త్ వర్కౌట్ కూడా పూర్తి చేశాను. కాస్త తలనొప్పిగా ఉంది. కానీ, దానికి ఒక మంచి బిర్యానీ, కాస్త నిద్ర సరిపోతుంది. ఎవరూ కంగారు పడకండి" అంటూ తనదైనశైలిలో అభిమానులకు ఆయన భరోసా ఇచ్చారు.
కాగా, తన కారు ప్రమాదంపై ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకే విజయ్ దేవరకొండ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ప్రమాద వార్త తెలియగానే ఆయన అభిమానులు ఒకింత ఆందోళనకు గురైనప్పటికీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ ట్వీట్‌తో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి సాయిబాబా మహా సమాధిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, గద్వాల్ జిల్లా ఉండవల్లి వద్ద జాతీయ రహదారి 44 వద్ద విజయ్ ప్రయాణిస్తున్న కారును బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయ్ దేవరకొండ కారు ముందుబాగా దెబ్బతింది. ఆ తర్వాత మరో కారులో విజయ్ ఫ్యామిలీ హైదరాబాద్ నగరానికి క్షేమంగా చేరుకున్నారు.