సీనియర్ నటుడు రావి కొండలరావు ఇకలేరు. ఆయన గుండెపోటుతో చనిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈయన కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడుగా రాణించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1932లో జన్మించిన రావి కొండలరావు 'సుకుమార్' అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు. నాటికలు, నాటకాలు కూడా రచించారు.
2004లో ఆయన రచించిన బ్లాక్ అండ్ వైట్ అనే పుస్తకం తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారానికి ఎంపికైంది.
'భైరవద్వీపం', 'బృందావనం' చిత్రాలకు సంభాషణలు, 'పెళ్ళి పుస్తకం' చిత్రానికి కథ అందించారు. తమిళ, మలయాళ చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఆయన సతీమణి దివంగత రాధాకుమారి కూడా ప్రముఖ నటి.