తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు కుర్ర హీరోలతో కలిసి నటించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్, యువ హీరో వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన చిత్రం "ఎఫ్2". ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ముఖ్యంగా 'ఎఫ్2' చిత్రంలో వెంకటేష్ - వరుణ్‌లు తోడల్లుళ్లుగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ మరో మల్టీ స్టారర్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన "డీజే" (దువ్వాడ జగన్నాథం) చిత్రం తర్వాత ఏ ఒక్క సినిమాని పట్టాలెక్కించని హరీష్ శంకర్ త్వరలో కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'జిగర్ తాండా' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది.
తమిళంలో సిద్ధార్ధ్, బాబీ సింహాల పాత్రలని తెలుగులో నాగ శౌర్య, వరుణ్ తేజ్‌లు పోషించనున్నారని అంటున్నారు. తెలుగు నేటీవిటికి తగ్గట్టుగా హరీష్ శంకర్ స్క్రిప్టుని సిద్ధం చేసుకోగా వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.