నటుడిగా రజనీకాంత్ అంటే ఇష్టం. సినిమారంగంలో గురువులుగా డా. దాసరి నారాయణరావు, డా. డి. రామానాయుడు అయితే నటన గురువుగా సత్యానంద్ గారని - వర్థమాన కథానాయకుడు నట్టిక్రాంతి తెలియజేశారు. సినిమారంగంలో నిర్మాతగా, దర్శకుడిగా, ఎగ్జిబిటర్‌గా, పంపిణీదారుడిగా విశేష అనుభవం వున్న నట్టికుమార్ తనయుడే నట్టిక్రాంతి. తన తండ్రి నుంచి నేర్చుకున్న మంచితనం, ఎదుటివారిని గౌరవించడం, నిర్మాణ విలువలతో నటుడిగా నిర్మాతగా ఎదగాలనేది తన ఆశయమని నట్టిక్రాంతి.స్పష్టం చేస్తున్నారు.
నట్టిక్రాంతి.కథానాయకుడిగా నటించిన సినిమా `వర్మ`. వీడు తేడా- అనేది ఉపశీర్షిక. ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నాయికలు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన ఈ చితం జనవరి 21న భారీగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నట్టిక్రాంతి విలేకరులతో పలు విషయాలు వెల్లడించారు.
- తొలి సినిమాకే దర్శకుడు తండ్రి కావడం అదృష్టంగా భావిస్తున్నా. నటుడిగా నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మొదటి రోజు కొద్దిగా ఇబ్బంది పడినా రెండో రోజునుంచి కెమెరా ముందు ఫీలింగ్ లేకుండా నటించేశాను.
- నాకు దర్శకత్వం అంటే ఇష్టం. అందుకే కొన్ని సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాను. ఆ తర్వాత నిర్మాతగా కూడా నిలదొక్కుకోవాలని అనుకొన్నాను. దానికి సంబంధించిన శిక్షణ పొందేందుకు యు.ఎస్.లోని న్యూయార్క్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో తర్ఫీదు పొందాను. అక్కడ ఎడిటింగ్ వంటి అంశాలు నేర్చుకున్నాను. అది ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి.
- ఆ తర్వాత వైజాగ్ సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆయన నేను చేస్తున్న `వర్మ` సినిమా కథ తెలుసు. నీ బాడీ లాంగ్వేజ్‌కు సరైన కథ. అంటూ ఆశీర్వదించారు. ఆ తర్వాత ట్రైలర్ చూశాక మంచి భవిష్యత్ వుందన్నారు.
- `వర్మ` టైటిల్ వినగానే రామ్ గోపాల్ వర్మ గురించి అనుకుంటారు. కథకూ దానికి సంబంధమే లేదు. కేవలం ప్రమోషన్ కోసం చేశాం. ఇదో థ్రిల్లర్ కథ. చక్కటి లవ్ స్టోరీకూడా వుంది.
- కథ ప్రకారం హీరో పేరు వర్మ. తను ఓ సైకో. అలాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఎలా వుంటుంది? చివరికి ఏమయింది? అనేది సినిమాలో ఆసక్తికరంగా వుంటుంది. చివరి అరగంటపాటు ప్రేక్షకుడ్ని కట్టిపడేస్తుంది. హృదయాన్ని కదిలించే సినిమా అవుతుందని చెప్పగలను.
- తొలిసినిమానే కొత్త ప్రయోగం చేయాలని చేశాను. ఈరోజుల్లో ఆడియన్స్ చాలా మెచ్చూర్డ్ అయ్యారు. సాధారణ సినిమాలకంటే `వర్మ` వంటి వైవిధ్యమైన కథలనే చూస్తున్నారు. రేపు సినిమా చూశాక మీరు నిజమని నమ్ముతారు.
- బయట వారు చూసి చెప్పడం వేరు. అమ్మగాను, నా సోదరి చూసి నటుడిగా బాగా చేశాని మెచ్చుకోవడం మరింత బలాన్నిచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఆ తర్వాత తమిళ ప్రేక్షకులు బాగా నచ్చుతుందనే నమ్మం కూడా వుంది. తమిళంలో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవ్వలేదు. ముందు నాలుగు భాషల్లో విడుదలచేస్తున్నాం. ఆ తర్వాత తమిళంలో విడుదల చేస్తాం.
- నటుడిగా హీరోనే కాకుండా కథలో ప్రాధాన్యత వున్న పాత్ర చేస్తాను. బయటి ప్రొడక్షన్‌లో చేయడానికి రెడీ. నాకు టెక్నికల్‌గా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ప్రస్తుతం నిర్మాణపరంగా బాధ్యతలు చూడాలనుకుంటున్నా. ఆ తర్వాత అన్నీ కలిసివస్తే దర్శకత్వం చేపడతాను.
- కశ్మీర్‌లో గడ్డ గట్టే చలిలో నాలుడురోజులపాటు ఓ పాటను చిత్రీకరించాం. హీటర్‌లు పెట్టుకుని అలా సినిమా చేయడం గొప్ప అనుభూతిగా మిగిలింది.
- ప్రతి నటుడికి సంక్రాంతికి సినిమా విడుదల కావాలని వుంటుంది. నాకు చిన్నప్పటినుంచీ కల. అది ఈసారి నెరవేరుతుంది. ఈనెల 21న నాలుగు భాషల్లో విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే నెలలో జవవరి 28 నేను నిర్మాతగా వున్న `డి.జె.` సినిమా విడుదలకావడం నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంది.