ఈమధ్య సినిమారంగంలో వారసులు అనే మాట ఎక్కువగా వినపడుతుంది. పరిశ్రమలో నిలబడాలంటే బ్యాక్‌గ్రౌండ్ వుండాలనేది నానుడి. అలాంటివాటికి తగినట్లుగా సమాధానమిచ్చారు నిర్మాత బన్నీవాసు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వున్న ఆయన ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. బయట సినిమాలుకూడా నచ్చితే గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో `క్షణక్షణం` సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇందులో నటించిన హీరో ఉదయ్ శంకర్. తను తనికెళ్ళభరణి దర్శకత్వంలో ఆటగదరా శివ చిత్రంలో నటించారు.
ఉదయ్ ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు. పరిశ్రమలోని అందరూ ఆయనకు తెలిసినవాళ్ళే. ఈ విషయాన్ని గురించి బన్నీవాస్ క్లారిటీ ఇస్తూ, ఇష్టంతో కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి వస్తారు. మా నాన్నగారికి పరిశ్రమ గురించి తెలీదు. నేను ఊరిలో వున్నప్పుడు నాన్నగారిది చిన్న వ్యాపారం. కానీ నాకు సినిమా అంటే పిచ్చి. ప్రతి సినిమా చూసి విశ్లేషించేవాడిని. నాకే బ్యాక్ గ్రౌండ్ లేదు. సినిమాను ప్రేమించాను కాబట్టి ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. వారసులకైనా మొదటి ఆట వరకే అడ్వాంటేజ్. ఆ తర్వాత వాళ్లు ప్రూవ్ చేసుకోవాల్సిందే` అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇది దాదాపు పరిశ్రమలోని హీరోలందరికీ వర్తిస్తున్నట్లుగా ఆయన మాటల బట్టి అర్థమయింది.