'మనం'ను పరిగణనలోకి తీసుకోకపోవడమే పక్షపాతం : ఎన్వీ ప్రసాద్
మంచి హిట్ సాంధించిన మనం చిత్రాన్ని నంది అవార్డుల జ్యూరీ కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం ఈ అవార్డుల ఎంపికలో పక్షపాతం జరిగిందని చెప్పడానికి ఓ మంచి ఉదాహరణ అని ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు.
మంచి హిట్ సాంధించిన మనం చిత్రాన్ని నంది అవార్డుల జ్యూరీ కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం ఈ అవార్డుల ఎంపికలో పక్షపాతం జరిగిందని చెప్పడానికి ఓ మంచి ఉదాహరణ అని ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. బాలల దినోత్సవం రోజున ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై టాలీవుడ్‌లో పెను వివాదమే చెలరేగిన విషయం తెల్సిందే.
ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో తప్పు జరిగిందని చెప్పడంలో సందేహం లేదన్నారు. జ్యూరీ తప్పు చేసిందని వ్యాఖ్యానించిన ఆయన, జ్యూరీ సభ్యులెవరూ ప్రెస్ ముందుకు రాకూడదని రూల్ ఉన్నా, దాన్ని అతిక్రమించారన్నారు. దర్శకుడు గుణశేఖర్ బాధను అర్థం చేసుకోవాలని అన్నారు. అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడి అవార్డు కోసం దరఖాస్తు చేస్తే, ఆ అవార్డును ఇవ్వకుండా మరో అవార్డును ఇచ్చారని, అలా చేసేముందు తప్పనిసరిగా గుణశేఖర్‌ను సంప్రదించాల్సిన జ్యూరీ అలా చేయలేదని విమర్శించారు.
నటీనటులు చిత్రం నిర్మాణంలో పడే కష్టం గురించి జ్యూరీ సభ్యులకు తెలియదన్నారు. చనిపోతూ కూడా నటించాలని కోరుకున్న అక్కినేని నాగేశ్వరరావు ఆఖరు చిత్రం 'మనం'ను పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. జ్యూరీ చేసిన తప్పులకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అవార్డు ఇచ్చిన తర్వాత బయటకు చెప్పకుండా ఉండాల్సిన సభ్యులు, ముందే బయటకు చెప్పారని, అందువల్ల కూడా రచ్చ పెరిగిందని అన్నారు. బన్నీకి అసలు అవార్డు ఇవ్వకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రుద్రమదేవి సినిమాకు సంబంధించి దరఖాస్తు చేసిన కేటగిరీలో కాకుండా, వేరే కేటగిరీలో అల్లు అర్జున్‌కు అవార్డు ఇవ్వడాన్ని ఎన్వీ తప్పుబట్టారు.