Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుటుంబ ప్రేక్షకులనూ మెప్పించేలా టిల్లు స్క్వేర్ ఉంటుంది : సిద్ధు జొన్నలగడ్డ

Sidhu, Anupama Parameswaran, naga vamsi Mallik Ram

డీవీ

, సోమవారం, 18 మార్చి 2024 (21:13 IST)
Sidhu, Anupama Parameswaran, naga vamsi Mallik Ram
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి.
 
ఇప్పుడు 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ గా 'టిల్లు స్క్వేర్' వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
webdunia
Sidhu, Anupama Parameswaran, naga vamsi Mallik Ram
'టిల్లు స్క్వేర్' నుంచి ఇప్పటికే విడుదలైన 'టికెటే కొనకుండా', 'రాధిక' పాటలు విశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఓ మై లిల్లీ' అనే పాట విడుదలైంది. సోమవారం వారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో అభిమానుల కోలాహలం మధ్య జరిగిన వేడుకలో ఈ పాటను విడుదల చేశారు.
 
అచ్చు రాజమణి స్వరపరిచిన 'ఓ మై లిల్లీ' మెలోడీ సాంగ్ కట్టి పడేస్తోంది. గాయకుడు శ్రీరామ్ చంద్ర తన మధుర స్వరంతో మాయ చేశాడు. సిద్ధు, రవి ఆంథోనీ సాహిత్యం అద్భుతంగా కుదిరింది. తేలికైన పదాలతో లోతైన భావాన్ని పలికించారు. ఇక లిరికల్ వీడియోలో సిద్ధు, అనుపమ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
పాట విడుదల సందర్భంగా దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. "ఓ మై లిల్లీ పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమా మొదలైనప్పుడే ఎంతో బాధ్యత, ఒత్తిడి ఉందని అర్థమైంది. మాకు ఒక మంచి టీం దొరికింది. అందరం కలిసి మంచి అవుట్ పుట్ ని తీసుకొచ్చాము. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు.
 
కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "డీజే టిల్లు చేసే సమయంలో ప్రేక్షకుల్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాము. కానీ టిల్లు స్క్వేర్ పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా, మొదటి భాగాన్ని మించేలా సినిమాని రూపొందించాము. టిల్లు పాత్ర అలాగే ఉంటుంది. కానీ కథ మాత్రం వేరేలా ఉంటుంది" అన్నారు.
 
మీ ప్రేమ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి:
కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. "నేను మొదటిసారి టిల్లు స్క్వేర్ కి సంబంధించిన వేడుకలో పాల్గొన్నాను. మీ స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి ఒక్క వేడుక కూడా మిస్ అవ్వను. మీ ప్రేమ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి. మార్చి 29న సినిమా విడుదలవుతోంది. ఈ చిత్ర విడుదల కోసం మేము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.
 
కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా ఉంటుంది:
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. వేసవి సీజన్ లో మొదటి సినిమాకి లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో మార్చి 29న వస్తున్నాం. ఎన్నికలు కూడా ఏప్రిల్ లో లేకపోవడంతో కలిసొచ్చింది. డీజే టిల్లు మొదట యూత్ ఫుల్ సినిమాగా ప్రచారం పొందింది. కానీ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన లభించింది. టిల్లు స్క్వేర్ కూడా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది" అన్నారు.  
 
'టిల్లు స్క్వేర్' చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. రామ్ మిరియాల, అచ్చు రాజమణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుదేవ నటించిన ప్రేమికుడు గ్రాండ్ రీ రిలీజ్