సినిమారంగంలో వున్న కొన్ని సమస్యలకు అటు కేంద్రప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసింది ఏమీలేదని ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు డి.సురేష్‌బాబు తేల్చిచెప్పారు. ఎ.పి.లో టిక్కెట్ల రేట్ల విషయంలో ఇటీవలే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయమై శనివారంనాడు ఆయన మాట్లాడుతూ, దృశ్యం2 సినిమాను ఓటీటీకి ఇవ్వడానికి కారణముంది. టికెట్ల రేట్ల సమస్య కూడా ఈ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30 అది చాలా నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు. ఈ కారణాల వల్ల దృశ్యం 2 సినిమాను ఓటీటీకి ఇవ్వలేదు. ఇది ఓటీటీలో అయితే బాగుంటుందని అనుకున్నాం.
ప్రభుత్వంతో ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరుగుతుంది అనిపిస్తుంది. మరీ అంత తక్కువ రేట్లు పెట్టడమనేది కూడా కరెక్ట్ కాదు. ఓ ప్రొడక్ట్‌ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలలలో మాకు కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంట్ బిల్లులు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెలిపారు.