Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వానికి వారధి ఫిలింఛాంబర్ మాత్రమే - త్వరలో కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ : పవన్ కళ్యాణ్

Advertiesment
Chandrababu- Pawan

దేవీ

, మంగళవారం, 27 మే 2025 (14:24 IST)
Chandrababu- Pawan
తెలుగు చలనచిత్రరంగంలో పలు సమస్యలకు పరిష్కార దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పాలసీ తేనున్నది. ఈ విషయాన్ని మంగళవారంనాడు ప్రకటించారు. సినిమా టికెట్లరేట్ల విషయంలోనూ, థియేటర్లలో ఆహార పానీయాల విషయంలోనూ పలు నియమాలు తెలియజేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది.
 
సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి 
* థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు 
* నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి 
* రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది 
* సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి 
* ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దు 
 
రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని... ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు - సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రివర్యులకు వివరించారు. 
 
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు... ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని... ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు. 
* ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే..?
 
టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఇంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్యా పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకొంటాయన్నారు.
 
సినిమా హాళ్ల బంద్ నేపథ్యంపై...
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం... తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. 
 
బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు... బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. 
 
అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతీంద్రియ శక్తుల గల శంబాల లో బాలుగా శివకార్తీక్