విజయ్ దేవరకొండ నటిస్తోన్న `లైగర్` సినిమాకు ఇప్పటికే రావాల్సిన దానికంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది. బాలీవుడ్‌లో కరన్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో వుండడంతో క్రేజ్ ఏర్పడింది. పూరీ జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా తీసేశారు. ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఇందులో నటించాడు. విజయ్ కు గురువుగా ఆయన మెళకువులు నేర్పిస్తున్నాడు. వీరిద్దరి కలయిక ఎలా జరిగింది? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలని దర్శకుడు తెలియజేస్తున్నాడు.
తాజా ఈ సినిమాకు మరో పబ్లిసిటీ యాడ్ అయింది. ఒరిస్సాకు చెందిన సైకతశిల్పి దశరథ మహంతా ఒక ప్రాంతాంలో ఇసుకతో పోస్టర్‌ను రూపొందించారు. ఇందులో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మొహాలు కనిపించేలా తీర్చి దిద్దాడు. దీనికి ఒరిస్సాలో మంచి క్రేజ్ వచ్చింది. ఇలా పాన్ ఇండియా సినిమాను అన్ని భాషలవారికి తెలిసేలా ప్లాన్ జరుగుతోంది. అనన్యపాండే నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే కోవిడ్ వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 25 ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో వున్నారు.