vijayendra prasad, Rk gound, senthil kumar and others
తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్బంగా `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` బ్రోచర్ ను ఈ రోజు ఫిలించాంబర్ లో ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే `ఆర్ఆర్ఆర్` సినిమాటోగ్రాఫర్ కె.కె సెంథిల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ....``గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని మళ్లీ ప్రతాని రామకృష్ణ గారు ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్ గా నంది అవార్డ్ కేటాయిస్తే బావుంటుందన్నది నా ఆలోచన. అలాగే తెలంగాణ లో అద్భుతమైన టూరింగ్ స్పార్ట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం అక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్ తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే మరిన్ని చిత్రాలు రూపొందడంతో పాటు తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది`` అన్నారు.
టియస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ...`` ప్రతాని రామకృష్ణ గారు ఇస్తోన్న ఈ అవార్డ్స్ కి ప్రభుత్వం తరఫునుంచి కచ్చితంగా మంచి సపోర్ట్ లభిస్తుంది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఈ అవార్డ్స్ సక్సెస్ ఫుల్ గా జరిగేలా చూస్తాము. అలాగే తెలంగాణలో ప్రస్తుతం టూరిజం స్పార్ట్స్ పెరిగాయి. విజయేంద్రప్రసాద్ గారు చెప్పిన విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం`` అన్నారు.
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ...``టియఫ్ సీసీ నంది అవార్డ్స్2021, 22 సంవత్సరాలకు గానూ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసి అర్హులకు ఈ అవార్డ్స్ ఇవ్వనున్నాం. ఈ అవార్డ్స్ ఫంక్షన్ దుబాయ్ లో గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం. 2021, 22 సంవత్సరంలో విడుదలైన చిత్రాల వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రముఖులతో ఏర్పాటు అయిన కమిటీ మెంబర్స్ చిత్రాలను చూసి అర్హులు అనుకున్న వారికి అవార్డ్స్ ప్రకటిస్తాం. దుబాయ్ ప్రిన్స్ డేట్ తీసుకుని త్వరలో అవార్డ్స్ డేట్ అధికారికంగా ప్రకటిస్తాం`` అన్నారు.
తెలుగు ఫిలించాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...``కొన్నేళ్లుగా నంది అవార్డ్స్ ఇవ్వడం లేదు. ఇలాంటి క్రమంలో ప్రతాని గారు ముందుకొచ్చి కళాకారులను పోత్సహించడానికి మళ్లీ టియఫ్ సిసీ నంది అవార్డ్స్ ఇవ్వడం అభినందించాల్సిన విషయం. అవార్డ్స్ అనేవి ఎప్పుడూ మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఇటీవల తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో మనకు ఎంతో గౌరవం పెరిగింది. తెలుగు వాడి సత్తాని ఎన్టీఆర్ గారి తర్వాత ఆస్కార్ తో `ఆర్ ఆర్ ఆర్` చిత్రం మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలాంటి క్రమంలో ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నంది అవార్డ్స్ ని ప్రతాని గారు ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఆయన్ను అభినందించాలి`` అన్నారు.
సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ మాట్లాడుతూ...``మనం చేసే పనికి గుర్తింపు వస్తే అదొక ఆనందం. ఆ గుర్తింపు, ప్రోత్సాహాన్నిఇచ్చేవి అవార్డ్స్ . అలాంటి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ ఆపివేయడం దురదృష్టకరం. మళ్లీ ప్రతాని గారు నంది అవార్డ్స్ స్టార్ట్స్ చేయడం సంతోషకరమైన విషయం`` అన్నారు.
ఇంకా కెయల్ న్ ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్,వంశీ , శ్రీశైలం , నటి శుభశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.