మెగాస్టార్ చిరంజీవికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటూ రెండు మూడు రోజులు చికిత్స తీసుకున్నారు. అయితే, ఆయనలో కరోనా లక్షణాలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి ఒకటికి మూడుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ మూడు పరీక్షల్లోనూ నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆయన స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు.
దీపావళి పండుగ రోజున తన గురువు, ప్రముఖ సినీ దిగ్గజం, కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. విశ్వనాథ్ దంపతులతో కలిసి ఫోటోలు దిగారు. అంతేకాకుండా, వారి ఇంటి సభ్యులతో కూడా కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కరోనా నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ ఒకసారి వచ్చిన తర్వాత కూడా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సివుంది. కానీ, దీపావళి పండుగ రోజున చిరంజీవి దంపతులు దర్శకుడి విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. దీనిపై విమర్శలు చెలరేగడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు స్పందించారు.
ఒకసారి కరోనా పాజిటివ్ గా తేలి, ఆపై నెగటివ్ వచ్చినా, ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనల ప్రకారం, క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడిన వేళ, నటుడు చిరంజీవికి తొలుత పాజిటివ్ వచ్చి, ఆపై అది నెగటివ్‌గా తేలిన విషయం ప్రస్తావనకు వచ్చింది.
దీనిపై స్పందించిన శ్రీనివాసరావు, ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరు శాతం ఖచ్చితత్వంతో రాదని స్పష్టంచేశారు. ఒకసారి పరీక్షలో పాజిటివ్ వస్తే, పాజిటివ్‌గానే భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు. ఆ తర్వాత నెగటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నా, లేకున్నా, క్వారంటైన్‌లో ఉండి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం, ఫలితం తప్పుగా వచ్చిందని తేలినా, క్వారంటైన్‌లో ఉండాల్సిందే.
కరోనా టీకాపైనా స్పందించిన ఆయన, కేంద్రం నుంచి అందుతున్న సంకేతాల మేరకు జనవరి లేదా ఫిబ్రవరిలో హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు.ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, ప్రజలు భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ ధరిస్తేనే కరోనాకు దూరంగా ఉండవచ్చని సూచించారు.