వచ్చే నెల ఒకటో తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగున్నాయి. ఇందుకోసం తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలో అధిక సంఖ్యలో ఓట్లు కలిగివున్న సినీ ఇండస్ట్రీపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.
కొన్నిరోజుల కిందట చిరంజీవి, నాగార్జున తదితర సినీ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి టాలీవుడ్‌ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. కరోనా కారణంగా దెబ్బతిన్న తెలుగు చిత్ర పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు.
రూ.10 కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల యాజమాన్యాలు షోలు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. అంతేకాకుండా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న విధంగా సినిమా టికెట్ రేట్లు సవరించుకునేందుకు అనుమతినిస్తున్నట్టు తెలిపారు.
ముఖ్యంగా, జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థల తరహాలో ఉండే హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కనీస డిమాండ్ చార్జీలను రద్దు చేశారు. కరోనాతో కుదేలైన మరో రంగం చిత్ర రంగం అని, చిత్రనిర్మాణానికి పెట్టింది పేరైన మన సినీ పరిశ్రమ పునరుద్ధరణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.