బాహుబలి-2ని మించిన సినిమా రావాలంటే రజనీ-రాజమౌళి సినిమా చేయాల్సిందే.. రంగుల కలల్లో తమిళ నిర్మాతలు
ఒకవైపు బాహుబలి అమ్మ కాదు అమ్మమ్మ లాంటి సినిమా తీసిపడేసి ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాను మడిచిపారేయాలంటూ అటు బాలీవుడ్, ఇటు కొలీవుడ్ చిత్ర దర్శకులు, స్టార్ హీరోలు ఉడికిపోతున్నట్లు వార్తలమీద వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హిందీలో అమీర్ ఖాన
ఒకవైపు బాహుబలి అమ్మ కాదు అమ్మమ్మ లాంటి సినిమా తీసిపడేసి ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాను మడిచిపారేయాలంటూ అటు బాలీవుడ్, ఇటు కొలీవుడ్ చిత్ర దర్శకులు, స్టార్ హీరోలు ఉడికిపోతున్నట్లు వార్తలమీద వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హిందీలో అమీర్ ఖాన్ బాహుబలి2 ని మించిన సినిమా తీస్తానంటూ శపథం చేయడం తెలిసిందే. మరోవైపు తమిళ చిత్రసీమ గొడ్డుపోయిందా.. మకు లేవా పురాణాలు, భారీ కథలు. బాహుబలిని మించిన సినిమా మనం తీయలేమా అంటూ ఆటోగ్రాఫ్ దర్శకుడు, హీరో చేరన్ తమిళ చిత్రపరిశ్రమను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ తమిళ నిర్మాతల ఆలోచనలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లున్నాయి. బాహుబలి అమ్మమ్మ లాంటి సినిమా తీయాలంటే అది రాజమౌళికే సాధ్యమని తనకు రజనీకాంత్ జత అయితేనే బాక్సాఫీసు బద్దలవుతుందని కాబట్టి వారిద్దరి కాంబినేషనలో సినిమాను ఒప్పించడమే అసలు పని అని తమిళ నిర్మాతలు కలలు కంటున్నారని సమాచారం.
నిజంగానే సూపర్‌స్టార్ రజనీకాంత్, సూపర్ డైరెక్టర్ రాజమౌళి... కలిసి సినిమా చేస్తే సూపరుంటుంది. అప్పుడు ఇండియాలో థియేటర్లు చాలవేమో! అంతలా ప్రేక్షకులు ఎగబడతారు. కానీ, కాంబినేషన్‌ను సెట్ చేసేదెవరు? అంటే బోల్డంత మంది నిర్మాతలు ఇప్పుడిదే పనిలో ఉన్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలని కలలు కంటున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ హిట్ తర్వాత రాజమౌళితో సినిమా చేయడానికి పలువురు హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్.
కొందరు నిర్మాతలైతే రజనీ–రాజమౌళి కాంబినేషన్‌ను సెట్ చేయడానికి ఓ రేంజ్‌లో ట్రై చేస్తున్నారట! వాళ్ల కలలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ‘‘ఫ్యామిలీతో కలసి భూటాన్ హాలిడే ట్రిప్‌కి వెళ్లొచ్చాక తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తా’’ అని ఇటీవల రాజమౌళి చెప్పారు. నార్మల్‌గా భారీ సినిమా తర్వాత చిన్న సినిమా తీయడం ఈ దర్శకుడి స్టైల్. కానీ, ఇక్కడ రజనీ హీరో అనేది టెంప్ట్ చేసే ఆఫర్. కథ కుదిరితే రజనీతో చేస్తానని ఓ సందర్భంలో రాజమౌళి అన్నారు. సో.. కథ కుదిరితే కాంబినేషన్ కుదిరినట్లే!
అయితే అసలు ట్విస్టు ఇక్కడే ఉంది. రజనీతో సినిమా అంటే హీరోయిజాన్ని ప్రదర్శించడం మాత్రమే అయినట్లయితే అందుకు రాజమౌళి అవసరమే లేదు. ఏ దర్శకుడయినా తీస్తాడు. కానీ బాహుబలి-2 సినిమా చూడడానికి కుటుంబాలు కుటుంబాలే రెండు, మూడు సార్లు పరిగెడుతున్నాయంటే, చూసినవారే మళ్లీ మళ్లీ చూస్తున్నారంటే హీరోని ఆకాశంలో నిలబెట్టడం కాకుండా భారతీయ కుటుంబ విలువలను ఉదాత్తంగా తీసే భావోద్వేగ దర్శకుడు, అంతకు మించిన కథ ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ వాస్తవాన్ని మర్చి రజనీ హీరోయిజాన్ని, రాజమౌళి దర్శకత్వ ప్రభను క్యాష్ చేసకుందామని వస్తే మాత్రం ఏ భాషలో అయినా సరే దిమ్మతిరగడం ఖాయం.