గుడ్లగూబ పక్షిని అపశకునంగా, దురదృష్టానికి సంకేతంగా కూడా భావిస్తారు. అయితే అలాంటి పక్షిని దత్తత తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు నిర్మాత, నటుడు సూర్యతేజ్. శుక్రవారం హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్కును ఆయన సందర్శించాడు.
అనంతరం జూపార్క్‌లోని గుడ్లగూబను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన రూ.20వేల చెక్‌ను జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్‌కు అందించాడు.
ఈ సందర్భంగా సూర్యతేజ్ మాట్లాడుతూ నెహ్రూ జులాజికల్ పార్కును సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. తన జీవితంలో మరుపురాని విషయాల్లో ఇది కూడా ఒకటని తెలిపాడు.
హైదరాబాద్ నగరం ఎన్నో మూగజీవాలకు నిలయంగా ఉందని, నెహ్రూ పార్క్ నిర్వహణ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. అనంతరం జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్ మాట్లాడూతూ సూర్యతేజ లాగే మరికొంత మంది హీరోలు, సామాన్యులు జంతువులు, పక్షుల దత్తత కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.