నటీనటులు: సూర్య, సమంత, అజయ్, నిత్యమీనన్ తదితరులు.
సంగీతం: ఎ.ఆర్. రెహమాన్,
నిర్మాతలు: ఈరోస్ ఎంటర్‌టైన్ మెంట్, 2డి ఎంటర్‌టైన్‌మెట్,
సమర్పణ: జ్ఞానవేల్ రాజా,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె. కుమార్.
గ్రాఫిక్స్, విజువల్స్.. కీలకం.
ఇప్పటి దర్శకుల్లో క్రియేటివిటీను చూపిస్తూ పలు ప్రయోగాత్మక చిత్రాలు తీసేందుకు ముందుకు వస్తున్నారు. అలాంటివారిలో 'ఇష్క్', 'మనం' చిత్రాలను తీసి ఒక్కరాసి ఆలోచించేలా క్రియేటివ్ ముద్ర పొందిన విక్రమ్ కె.కుమార్ ఒకరు. ఈసారి తమిళస్టార్ సూర్యతో సైన్స్ ఫిక్షన్ అంశాన్ని తీసుకుని సాహసమే చేశాడు. '24' అనే పేరు పెట్టి.. టైంకు సంబంధించిన కాన్సెప్ట్‌గా ప్రేక్షకులకు ముందుగానే సూచన ఇచ్చాడు. అయితే టైం మిషన్ అనే కాన్సెప్ట్‌లో గతంలో బాలకృష్ణ.. ఆదిత్య 369.. చిత్రం వచ్చింది. మళ్ళీ దానికి సీక్వెల్‌గా మరో సినిమా చేయాలని బాలయ్య ఆమధ్య ప్రకటించాడు. కానీ ఇలాంటి కాన్సెప్ట్‌లు చూస్తారోలేదో.. అన్న డౌట్‌తోనేమోకానీ.. దాన్ని విరమించుకున్నాడు. కానీ.. యాదృశ్చికంగా సూర్య అటువంటి ప్రయోగం చేశాడు. అదెలా వుందో చూద్దాం.
కథ:
1990 సంవత్సరంలో డా|| శివకుమార్ (సూర్య) ఓ సైంటిస్ట్. ప్రయోగశాలలో కొత్తరకం చేతి గడియారాన్ని కనిపెడతాడు. దాని ద్వారా ఒక్కరోజు ముందుకు, వెనక్కు వెళ్ళగలరు. దాన్ని చేజిక్కించుకోవాలని అతని అన్న ఆత్రేయ (సూర్య), శివకుమార్‌ను ఆయన భార్యను చంపేస్తాడు. వాళ్ళకు అప్పడే నెలల పిల్లాడు వుంటాడు. వాడిని రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు ఇచ్చి కాపాడమని శివ చెబుతాడు.
కట్‌చేస్తే.. 26 ఏళ్ళకు కథ వర్తమానంలోకి మారుతుంది. అంటే 2016.. అప్పటికి ఆ పిల్లాడు మణి (సూర్య) పెరిగి పెద్దవాడై వాచ్ షాప్‌ను మెయిన్‌టెయిన్ చేస్తుంటాడు. అక్కడ ఓ పాత వాచ్. బ్యాక్స్ వుంటుంది. ఎప్పుడో దొరికిన ఆ బ్యాక్స్‌ను భద్రంగా మణి అమ్మ దాస్తుంది. కొద్దిరోజులకు అనుకోకుండా దాన్ని తెరిచే కీ.. మణి వద్దకు రావడం దాన్ని తెరిచాక వింతలు జరగడం గ్రహిస్తాడు. దాంతో. ఆ గడియారాన్ని చేతికి పెట్టుకుని కాలానికి ముందుకూ.. వెనుక్కు వెళ్ళేలా ఆడుకుంటున్నాడు.
ఆ ఆటలో సత్య భామ (సమంత) పరిచయం కావడం ప్రేమకు దారితీయడం జరుగుతుంది. ఇక.. ఆత్రేయ.. కోమాలో నుంచి బయటకు వచ్చి.. ఆ గడియారాన్ని చేజిక్కించుకోవాలని.. శిష్యుడు మిత్రా (అజయ్)తో కలిసి వేసిన ప్లాన్‌లో మణి దొరికిపోతాడు. మీ నాన్నను అని చెప్పి గడియారాన్ని ఇచ్చేలా నాటకం ఆడతాడు. కానీ ఆ తర్వాత మణికి అసలు విషయం తెలుస్తుంది. ఆ గడియారంతో.. వెనక్కువెళ్ళి... తన నాన్నను ఎలా కాపాడుకున్నాడు. అన్నది ముగింపు.
పెర్‌ఫార్మెన్స్:
సూర్య మూడు పాత్రలను పోషించాడు. అన్నదమ్ములుగా 1990లో నటిస్తే అందులో ఆత్రేయ పాత్ర క్రూయల్‌గా చేశాడు. వీల్‌చైర్‌కే అంకితమయిన ఆ పాత్ర కొత్తగా వుంటుంది. మూడో పాత్ర మణి.. ఇప్పటి జనరేషన్‌కు చెందింది. మూడు పాత్రల్లో వేరియేషన్ పండించాడు. నిత్య, సమంత పాత్రలు నామమాత్రమే. ఆత్రేయకు సహచరుడుగా ఆజయ్ పాలిష్ విలన్‌గా నటించాడు. ఇక మిగిలిన పాత్రలు అన్నీ.. కథలో నడిచిపోయాయి. ఓ షాట్‌లో డాక్టర్‌గా.. దర్శకుడు విక్రమ్ కుమార్. అలా మెరుస్తాడు.
టెక్నికల్‌గా..
ఇటువంటి చిత్రానికి సాంకేతిక చాలా ముఖ్యం. ఆ నాలెడ్జ్ వున్నవారికి ఈ చిత్రం అర్థమవుతుంది. విజువల్స్, గ్రాఫిక్స్.. అంతా రోబో, ఐ చిత్రాలను తలపింపచేస్తాయి. గడియారం తిరిగే సీన్స్ అన్నీ.. సాంకేతిక నైపుణ్యానికి చెందినవే... కెమెరాపనితనం చాలా బాగుంది. ఎడిటింగ్ కన్‌ఫ్యూజ్‌గా వుంది. అయితే ప్రతి క్రాఫ్ట్‌లోని కష్టం ఈ చిత్రంలో కన్పిస్తుంది.
విశ్లేషణ:
టైం.. ను వెనక్కు ముందు జరిపి.. మనం ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడం అనేది.. కలల్లోనే జరుగుతుంది. మనిషికి రకరకాలుగా కలలు వస్తుంటాయి. అవి ఎలా వస్తాయో.. ఎందుకు వస్తాయో.. దాని అర్థం ఏమిటో .. మనకు మెలకువగా వున్నప్పుడు ఆలోచిస్తే అర్థమేకాదు. దానిలో ఏదో విషయం దాగి వుందనేది..మాత్రం తెలుస్తుంది. '24' సినిమా కూడా దాదాపు అంతే.. ఊహకందని వింతవింత ఆలోచనలతో ఈ చిత్రాన్ని తీసిన సూర్యనూ, జ్ఞానవేల్‌ను అభినందించాల్సిందే. ఏదో రొటీన్ చిత్రాన్ని తీయకుండా.. సైన్ ఫిక్షన్.. అనే టాపిక్‌ను టచ్ చేసి మెప్పించడం కత్తిమీద సామే. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో.. దాన్ని బేస్‌చేసుకుని సినిమా తీసి, కామన్‌మేన్‌కు కనెక్ట్ చేయడంలో... శంకర్ 'రోబో'తోనే సాధ్యమయింది.
అదే హాలీవుడ్‌లో.. 'అవతార్' సినిమా వచ్చింది. అది పర్యావరణంపై ఓ సందేశంకూడా అందులో వుంది. కానీ అందులో వింతలోకం వింత మనుషులు చూడ్డానికి బాగుంటాయి. కానీ కామన్‌మేన్‌కు అర్థంకాదు. కానీ సినిమా బాగా ఆడింది. ఆ కోవలోనే రోబో.. అన్నీ వుండి.. విజయాన్ని సాధించింది. మళ్ళీ అటువంటి ప్రయోగంతో... విక్రమ్ తీసిన 'ఐ' సినిమా.. బాక్సాఫీస్‌వద్ద బోల్తా కొట్టింది. అయితే అదేమీ చెత్త సినిమాకాదు. పాయింట్ మంచిదే.. టెక్నాలజీ ఉపయోగించి... మనిషి.. జంతువుగా మారితో ఎలా వుంటుందే చూపించాడు. ఇప్పుడు... విక్రమ్ కుమార్.. కూడా... టైమ్ అనే కాన్సెప్ట్‌తో.. కాలానికి ముందుకూ వెనక్కువెళితే ఎలా వుంటుందో చూపించాడు. కానీ ఆ చూపే విధానంలో లాజిక్కు అస్సలు ఉండదు. అసలు కొన్ని సన్నివేశాలు ఎప్పుడు ముందుకు వెళ్ళాయి. ఎప్పుడు వెనక్కువచ్చాయి తెలీవు. అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఇదే చిత్రానికి ప్రధాన లోపం.
నలుగురులో కంటే ఒక్కడే ప్రత్యేకంగా వుండాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయాలి. కానీ అవి నలుగురికీ అర్థమయ్యేట్లుగా వుంటే చాలా బాగుంటుంది. ఈ చిత్రంలో క్రియేటివిటీ చాలా వుంది. దాన్ని క్యాచ్‌చేసే... మైండ్.. ప్రేక్షకులకు లేకపోవచ్చు. ఏదో కొద్దిమంది సైంటిస్ట్‌లు, మేథావులకు తప్పితే.. అయితే.. ఇందులో తనేం చెప్పదలచుకున్నాడు.. అనేది స్పష్టత లేదు దర్శకుడికి.. ఇలాంటివి ఓ ప్రయోగాత్మక చిత్రంగా గుర్తుపెట్టుకోవడానికి పనికివస్తాయి.
లేదంటే.. రొటీన్ చెత్త సినిమాలు చూసిన ప్రేక్షకులకు ఇదో కొత్త సినిమాగా అనిపిస్తుంది. ఏది ఏమైనా.. బ్యాక్‌టుది ఫ్యూచర్‌తోపాటు పలు విదేశీ చిత్రాల స్ఫూర్తితో తీసినట్లుగా ఈ చిత్రం వుంది. దాన్ని ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి. అయితే.. డా. శివకుమార్‌ను చంపిని ఆత్రేయ.. ఎలా బతికాడు. అనేది లాజిక్‌కు దొరకదు. అసలు టైం మిషన్ వల్ల 26 ఏళ్ళ యవ్వనాన్ని తాను పొందాలనుకోవడం లాజిక్కులేని ప్రశ్న.. దానికోసం కోట్లు ఖర్చుపెట్టి.. ప్రయోగాలు చేయడం.. అన్నీ... యక్ష ప్రశ్నలుగానే అనిపిస్తాయి.
గజనీ తీసినప్పుడు సూర్య అందరికీ అర్థమయ్యాడు. అదే రాక్షసుడు తీసి.. ఎవ్వరికీ అర్థంకాలేదు. అలాంటి ప్రయత్నమే 24.