కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య, పూజా హగ్డేలు జంటగా నటించిన తాజా చిత్రం "రెట్రో". ఈ చిత్రం మే నెల ఒకటో తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొని అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు.
"ఒక చిన్న హెచ్చరిక.. నేను కేవలం సినిమా అవసరం కోసం సిగరెట్లు కాల్చాను. దయచేసి మీ నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి" అని స్పష్టం చేసారు. పొగతాగడం ఒకసారి మొదలుపెడితే సులభంగా వదిలించుకోలేని వ్యసనంగా మారుతుందన్నారు. ఒక్క పఫ్ లేదా ఒక్క సిగరెట్‌తో మొదలుపెడతారు. కానీ ప్రారంభించాక దాన్ని ఆపడం చాలా కష్టం. నేను దీన్ని ఖచ్చితంగా ప్రోత్సహించను. మీరు కూడా చేయకండి అని హితవు పలికారు.
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తాను గతంలో చేసిన 45 చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది. కార్తీక్‌తో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.