Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూర్య న‌టించిన తొలి సినిమా చూసి ఇత‌నికి న‌టించ‌డం రావ‌డం లేదే అనుకున్నా... ర‌జ‌నీకాంత్‌

సూర్య న‌టించిన తొలి సినిమా చూసి ఇత‌నికి న‌టించ‌డం రావ‌డం లేదే అనుకున్నా... ర‌జ‌నీకాంత్‌
, మంగళవారం, 23 జులై 2019 (22:33 IST)
ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేసే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. 'సింగం' వంటి పక్కా కమర్షియల్ సినిమాలు... 'గజినీ', 'సెవెన్త్ సెన్స్', '24' వంటి డిఫరెంట్ సినిమాలు... 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి లవ్ స్టోరీలు చేయడం ఆయనకు మాత్రమే సాటి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. 
 
హేరీశ్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను ఆదివారం విడుద‌ల చేశారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మాట్లాడుతూ - ``శివాజీ సినిమాలో నాతో కె.వి.ఆనంద్ గారు ప‌ని చేశారు. ఆ సినిమా నేను శంక‌ర్‌తో చేయ‌డానికి కార‌ణ‌మైన వ్య‌క్తుల్లో కె.వి.ఆనంద్ గారు ఒక‌రు. ఆయ‌న‌కు క‌థ‌పై మంచి జ‌డ్జ్‌మెంట్ ఉంటుంది. ఆయ‌న‌తో నేను ఒక సినిమా చేయాల్సింది. కానీ.. కొన్ని ప‌రిస్థితుల్లో అది కుద‌ర‌లేదు. 
 
ఇక మోహ‌న్‌లాల్ గారు ఈ సినిమాలో మంచి పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న గొప్ప న‌టుడే కాదు.. గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి. అలాగే ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఆర్య‌.. న‌ట‌న‌ను 'నేను దేవుణ్ణి' సినిమాలో చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. అంత గొప్ప‌గా న‌టించారు. ఇక హేరీశ్ జైరాజ్ గారు.. మ్యూజిక్ చాలా బావుంది. ఆయ‌న సంగీతం అందించిన సినిమాల్లో 'చెలి'లోని మ‌నోహ‌రా... సాంగ్ నాకు బాగా ఇష్ట‌మైన సాంగ్‌. 
 
సుభాస్క‌రన్ గురించి చెప్పాలంటే... ఆయ‌న మ‌న‌కు దేవుడిచ్చిన వ‌రం. ఎందుకంటే ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో సగం మంది ఆయన సినిమాల్లోనే ప‌నిచేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్లో 'ఇండియ‌న్‌ 2' సినిమాను చేస్తున్నారు. అది త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది.
 
 అలాగే 60 ఏళ్లుగా ఎంజిఆర్ గారి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంద‌రో చేయాల‌నుకుంటున్న 'పొన్నియ‌న్ సెల్వ‌న్' సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే నేను, మురుగ‌దాస్‌గారు క‌లిసి చేస్తోన్న 'ద‌ర్బార్' సినిమాను నిర్మిస్తున్నారు. 
 
ఇక సూర్య గురించి చెప్పాలంటే... ఆయ‌న తండ్రి శివ‌కుమార్ గారి గురించి చెప్పాలి. త‌న స‌హ‌న‌టులు ఎవ‌రికీ చెడ్డ పేరు రాకూడ‌ద‌నుకునే వ్య‌క్తి ఆయ‌న‌. ఆయ‌న సూర్య, కార్తిని చక్కగా పెంచి పెద్ద‌చేశారు. కార్తి తొలి సినిమా 'ప‌రుత్తి వీర‌న్‌' (మ‌ల్లిగాడు)లో అద్భుతంగా న‌టించాడు. కానీ సూర్య న‌టించిన తొలి సినిమా చూసి ఇత‌నికి న‌టించ‌డం రావడం లేదే అనుకున్నాను. కానీ ఆయ‌న త‌న‌ను తాను మ‌లుచుకుని ఈ స్థాయికి వ‌చ్చి నిల‌బ‌డ్డారు. 
 
`శివపుత్రుడు`, 'సింగం', 'సింగం2‌, `వీడొక్కడే`, 'గ‌జిని' వంటి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయ‌న త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నేంత గొప్ప‌గా న‌టించారు. ఆయ‌న రీసెంట్‌గా ఎడ్యుకేష‌న్ సిస్టంపై చేసిన వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు త‌ప్పు ప‌ట్టారు. ఆయన‌కేం అర్హత ఉంద‌ని ప్ర‌శ్నించారు. కానీ.. అగ‌రం ఫౌండేష‌న్‌ను స్థాపించి ఎంద‌రికో విద్య‌ను అందిస్తున్న సూర్య అక్క‌డి పిల్ల‌లు పడే క‌ష్టాన్ని క‌ళ్లారా చూసుంటాడు. అందువ‌ల్లే త‌ను అలా స్పందించాడు. త‌న వ్యాఖ్య‌ల‌ను నేను స‌మ‌ర్ధిస్తున్నాను. 
 
త‌ను ఆ విష‌యంపై మాట్లాడ‌టానికి పూర్తిగా అర్హుడు. సూర్య ఇంకా `బందోబస్త్' వంటి సినిమాలే కాదు. ఎన్నో గొప్ప సినిమాలు చేసి ఇంకా ప్ర‌జాభిమానం పొందాలి. త‌ర్వాత ఆయ‌న అవ‌స‌రం త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల‌కు ఉంటుంద‌ని నేను భావిస్తున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్‌మ‌హ‌రాజ్ డిస్కోరాజా కోస అంత ఖ‌ర్చు పెట్టి సెట్ వేస్తున్నారా..?