చలికాలం ముగియనుంది. కానీ, వేసవికాలం ప్రారంభంకాకముందే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అదేసమయంలో టాలీవుడ్‌లో కూడా సమ్మర్ సీజన్ ఏప్రిల్ నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మార్చి ఒకటో తేదీన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన "118" చిత్రం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
అలాగే, ఈనెల 21 తేదీన "ఏబీసీడీ" చిత్రం విడుదల కానుండగా, 29వ తేదీన మెగా డాటర్ నిహారిక నటించిన "సూర్యకాంతం" చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆ తర్వాత నిఖిల్, అర్జున్ సురవరం వంటి కుర్ర హీరోల చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు మార్చి నెలలో విడుదల కానున్నాయి. అయితే, ఈ చిత్రాలన్ని తక్కువ రేంజ్ చిత్రాలే కావడం గమనార్హం.
ఏప్రిల్ నెలలో అసలు సమ్మర్ సీజన్ ఆరంభమవుతుంది. ఇందులో మొదటగా నాగచైతన్య - సమంత దంపతులు నటించిన "మజిలి" చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతుంది. నిజజీవితంలో భార్యాభర్తలుగా మారిన తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం.
ఆ తర్వాత ఏప్రిల్ 12వ తేదీన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. అందులో ఒకటి సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి' కాగా, రెండో సినిమా 'సూర్య ఎన్.జీ.కే'. గత కొన్ని నెలలుగా సరైన హిట్ లేక పరితపిస్తున్న సాయి ధరమ్ తేచ్.. 'చిత్రలహరి' చిత్రంతో హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇకపోతే 'సూర్య ఎన్.జి.కె' చిత్రం టీజర్ గత నెలలో విడుదలకాగా, మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం 'చిత్రలహరి'తో పోటీపడనుంది.
ఏప్రిల్ 18వ తేదీన నేచరుల స్టార్ నాని నటించిన "జెర్సీ" విడుదలవుతుంది. 19 వ తేదీన రాఘవ లారెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ "కాంచనా-3" ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాల తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించిన "మహర్షి" చిత్రం ఏప్రిల్ 25వ తేదీన విడుదలకానుంది. 'భరత్ అనే నేను' తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ముగ్గురు నిర్మాతలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. సో.. ఈ సమ్మర్ విజేత ఎవరో తెలియాలంటే ఏప్రిల్ నెలాఖరు వరకు వేచిచూడాల్సిందే.