కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గురించి ఆయన తనయుడు శుభవార్త చెప్పారు. తన తండ్రికి కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ.. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
తన తండ్రి ఆరోగ్యం గురించి సోమవారం శుభవార్త చెబుతానని గత వారం చరణ్ వెల్లడించిన విషయం తెల్సిందే. అదేవిధంగా సోమవారం ఆయన ఓ సందేశం వెల్లడించారు. ఇందులో తన తండ్రి బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా రిపోర్టు నెగెటివ్ వచ్చినా తాము, దాని గురించి పట్టించుకోవడంలేదని, ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా బాగుపడడంపైనే దృష్టి సారించామని తెలిపారు.
ప్రస్తుతం తన తండ్రి ఐపాడ్‌లో క్రికెట్, టెన్నిస్ కూడా చూస్తూ ఆస్వాదిస్తున్నారని, రాయగలుగుతున్నారని, చక్కగా భావవ్యక్తీకరణ చేయగలుగుతున్నారని చరణ్ వివరించారు. అంతేగాకుండా, వారాంతంలో తన తల్లిదండ్రులు పెళ్లిరోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నారని తెలిపారు.
అయితే, వెంటిలేటర్ తొలగింపుపై కాస్త సమయం పడుతుందన్నారు. అయన ఊపిరితిత్తులు ఇంకా పూర్తిస్థాయి సామర్థ్యం సంతరించుకోలేదని, అందుకే వెంటిలేటర్ సాయం కొనసాగిస్తున్నారని తెలిపారు. తన తండ్రి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆగస్టులో కొవిడ్ కారణంగా ఎస్పీ బాలు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించడం తెలిసిందే.