ఆదిలోనే హంసపాదు.. సంఘమిత్రకు నిజంగానే బాహుబలి స్థాయి ఉందా?
ఇదేమిటి ఈ విచిత్రం. బాహుబలిని మించిన సినిమా అంటూ తమిళ చిత్ర పరిశ్రమ ఘనంగా బాకాలూదిన సినిమా ఆదిలోనే ఇంత షాక్ ఇచ్చిందేమిటి? ఇంకా షూటింగే ప్రారంభం కాని సినిమాలో కథానాయికగా తన వంతు యుద్దవిద్యల శిక్షణ మొదలెట్టేసిన హీరోయిన్ అలా సడన్‌గా అస్త్ర సన్యాసం చేస్
ఇదేమిటి ఈ విచిత్రం. బాహుబలిని మించిన సినిమా అంటూ తమిళ చిత్ర పరిశ్రమ ఘనంగా బాకాలూదిన సినిమా ఆదిలోనే ఇంత షాక్ ఇచ్చిందేమిటి? ఇంకా షూటింగే ప్రారంభం కాని సినిమాలో కథానాయికగా తన వంతు యుద్దవిద్యల శిక్షణ మొదలెట్టేసిన హీరోయిన్ అలా సడన్‌గా అస్త్ర సన్యాసం చేస్తే ఆ చిత్రం పరువు ఏంకానూ అన్నది ఇప్పుడు సంఘమిత్ర అభిమానులందరినీ వేధిస్తున్న ప్రశ్న.
ఒక సుప్రసిద్ధ దర్శకుడు, ఒక ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఒక సూపర్ హిరోయిన్, ఇద్దరు సూపర్ హీరోలు భాగమైన చారిత్రాత్మక చిత్రం సంఘమిత్రలో వ్యవహారాలు ఇంత నాసిరకంగా ఉన్నాయా అనే సందేహం పుట్టుకొస్తోంది. ఎందుకంటే చేపా చేపా ఎందుకు ఎండలేదు అని అడిగితే చేప గొలుసుకట్టు సమాధానం ఇచ్చినట్లుగా సంఘమిత్ర పాత్రధారిణి శ్రుతిహసన్ ఈజీగా కథ అల్లేసింది.
‘సంఘమిత్ర’ నుంచి ఎందుకు తప్పుకున్నావ్ అనడిగితే... ‘‘నాదేం తప్పు లేదు. అసలు నాకు తప్పుకునే ఆలోచన కూడా లేదు. కానీ, నేనేం చేయను! నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వలేదు. డేట్ షెడ్యూల్ చెప్పలేదు. అందుకే, తప్పక తప్పుకున్నాను’’ అనే టైపులో ఆమె అధికార ప్రతినిధి ఓ ప్రకటన పంపారు. అదే సమయంలో శ్రుతీహాసన్ స్టేట్మెంట్ రావడానికి ముందే ‘సంఘమిత్ర’ చిత్రాన్ని నిర్మించనున్న శ్రీ తేనాండాళ్ స్టూడియోస్ సంస్థ ‘‘నిజమే... మా సినిమాలో శ్రుతి నటించడం లేదు. ఆమె తప్పుకుంది’’ అని స్పష్టం చేసింది.
అయితే శ్రుతి తన వంతు ప్రకటన వచ్చిన తర్వాత మేటర్ సీరియస్ అయ్యింది. మామూలు ప్రశ్నలు కావు. బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే 200 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీ తేనాండాళ్ స్టూడియోస్ సంస్థ సినిమా నిర్మించడానికి సిద్ధమైందా? దర్శకుడు సుందర్. సి కథేంటో చెప్పకుండానే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడానికి రెడీ అన్నారా? మిగతా ఆర్టిస్టులు డేట్స్ ఇచ్చారా? అని తమిళ సినీ జనాలకు బోలెడన్ని డౌట్స్ వచ్చాయి.
ఇంకేముంది ‘దర్శక–నిర్మాతలకు, శ్రుతికి మధ్య ఏవేవో గొడవలు జరిగాయి. వాళ్లు శ్రుతిని ఏదో అన్నారట. అందుకే, బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వలేదంటూ దర్శకుణ్ణి, షెడ్యూల్స్ చెప్పలేదంటూ నిర్మాతలను శ్రుతి టార్గెట్ చేసింది’ అని చెన్నై మీడియా కథలు అల్లేసింది.
ఈ వార్తలపై చిత్రనిర్మాణ సంస్థ స్పందించింది. అసలు గొడవేంటి అనేది చెప్పలేదు కానీ... ‘‘ప్రచారంలో ఉన్నట్టు దర్శకుడు గానీ, నిర్మాతలు గానీ శ్రుతిపై ఎటువంటి కామెంట్స్ చేయలేదు’’ అని నిర్మాణ సంస్థ ట్విట్టర్లో పేర్కొంది.
ఇంతకూ సంఘమిత్ర నుంచి శ్రుతి హసన్ ఎందుకు తప్పుకున్నట్లు అనే ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సీక్వెల్‌లాగా మారుతోంది. కొన్ని నిజాలు ఎప్పటికీ బయటపడవేమో మరి.