Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ బిగ్ బి ఫ్యామిలీకి కరోనా - నివాసాల వద్ద భద్రత పెంపు

బాలీవుడ్ బిగ్ బి ఫ్యామిలీకి కరోనా - నివాసాల వద్ద భద్రత పెంపు
, ఆదివారం, 12 జులై 2020 (13:11 IST)
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ ఫ్యామిలీకి కరోనా వైరస్ సోకింది. అమితాబ్‌తో పాటు ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ముంబైలోని బిగ్ బి నివాసంతో పాటు ఆయన చికిత్స తీసుకుంటోన్న ఆసుపత్రి వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు.
 
ముంబైలోని జుహు ప్రాంతంలోని ఆయన రెండు బంగ్లాలతో పాటు, నానావతి ఆసుపత్రి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఆసుపత్రి వద్ద అభిమానులు గూమి కూడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. ఆ ఆసుపత్రి వద్ద ఇతర కరోనా రోగులు కూడా ఉన్నారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని అన్నారు.
 
కాగా, అమితాబ్ నివాసం వద్దకు చేరుకున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సిబ్బంది ఆ ఇంటి గేటుకు ఓ బ్యానర్ అంటించారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తున్నట్లు అందులో ఉంది. అమితాబ్ బచ్చన్ నివాసాల వద్ద మునిసిపల్ సిబ్బంది శానిటైజ్‌ పనులు కొనసాగిస్తున్నారు.
 
అమితాబ్ - అభిషేక్‌లకు కరోనా... మరి ఐశ్వర్య సంగతేంటి? 
బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, అమితాబ్ భార్య జయా బచ్చన్, అభిషేక్ సతీమణి, సినీ నటి ఐశ్వర్యా రాయ్, వీరి కుమార్తె ఆరాధ్యల పరిస్థితి ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వీరికి నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని వచ్చింది. కానీ, శ్వాబ్ పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సివుంది. 
 
కాగా, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు నాలుగు రోజుల క్రితం ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా, శనివారం వచ్చిన ఆ పరీక్ష ఫలితంలో పాజిటివ్ అని తేలింది. దీంతో అమితాబ్‌ను శనివారం రాత్రి కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించారు. 
 
తనకు కరోనా సోకిందని తెలియగానే, గడచిన 10 రోజుల్లో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ ఖాతాలో అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో కోరారు. మరోవైపు ఆయన ఇంట్లోని కుటుంబీకులందరి నమూనాలనూ వైద్యులు సేకరించి, పరీక్షలకు పంపగా అభిషేక్ బచ్చన్‌కు కూడా పాజిటివ్ వచ్చింది.
 
అమితాబ్ భార్య జయాబచ్చన్, అభిషేక్ భార్య ఐశ్వర్యా రాయ్‌లకు నెగటివ్ వచ్చింది. మిగతా కుటుంబీకుల రిపోర్టులు వెల్లడికావాల్సి వుంది. అమితాబ్ కరోనా నుంచి కోలుకోవాలని ఆయన అభిమానులు, ప్రముఖులు ట్వీట్ల ద్వారా కోరుకుంటున్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
"అమితాబ్ ఓ యోధుడు... ఆయన త్వరగా కోలుకుని బయటకు వస్తారు" అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకోవాలని సచిన్, యువరాజ్ తదితరులు ట్వీట్ చేశారు. ఆయనకు కరోనా సోకడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున సైతం ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
 
అమితాబ్ ఆరోగ్యం ఆస్పత్రి ప్రకటన.. 
మరోవైపు, కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అమితాబ్‌ను ఐసొలేషన్ యూనిట్‌లో ఉంచామని  వెల్లడించారు. అమితాబ్ వయసు 77 సంవత్సరాలు కాగా, ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో వైద్యులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారని అన్నారు.
 
అమితాబ్‌కు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు జరిపించామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. ఈ తండ్రీ కొడుకులు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్ కావాలని సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమితాబ్‌కు కరోనా వైరస్ - అనుక్షణం అప్రమత్తతో వైద్యులు