మీ టూ ఉద్యమంలో భాగంగా తమిళ సినీ ప్రముకులపై సంచలన ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మళ్లీ డబ్బింగ్ చెప్పనున్నారు. ఆమె దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి తన వృత్తిని చేపట్టనున్నారు. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా "లియో"లో హీరోయిన్ త్రిష పాత్రకు ఆమె డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని చిన్మయి స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకి అవకాశం ఇచ్చిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, హీరో విజయ్‌కు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
అయితే, ఈ అంశంపై వచ్చిన వార్తను నటి సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్మయి మళ్లీ డబ్బింగ్ చెబుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. సమంత, చిన్మయి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. సూపర్ డూపర్ హిట్ చిత్రం 'ఏ మాయే చేశావే'లో సమంత చేసిన హీరోయిన్ పాత్రకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లోనూ సమంత పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.
కాగా, 'మీ టూ' ఉద్యమంలో భాగంగా తమిళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల అంశాన్ని పేర్కొంటూ చిన్మయి అప్పట్లో డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధారవి, గేయ రచయిత వైరముత్తు తదితరులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌత్ ఇండియన్, టెలివిజన్ ఆర్టిస్ట్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ చిన్మయిపై నిషేధం విధించింది. ఇపుడు ఆ కాలం తొలగిపోవడంతో తిరిగి డబ్బింగ్ వృత్తిలోకి అడుగుపెట్టారు.