లవ్‌స్టోరీ హిట్టు అంటున్నారు ప్రేక్షకులు. రేవంత్ పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడట. ముఖ్యంగా డ్యాన్స్ విషయంగా చైతూ చాలా మెరుగయ్యాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కష్టమైన స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇక మౌనిక పాత్రలో సాయి పల్లవి ఎప్పటి మాదిరే పరకాయ ప్రవేశం చేసింది. ఇక సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టమైన స్టెప్పులను ఈజీగా వేసి అదరగొట్టేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై రేవంత్, మౌనిక పాత్రలు మాత్రమే కనిపిస్తారు తప్ప సాయి పల్లవి, చైతూలు అస్సలు కనిపించరు. ఇక హీరో తల్లిపాత్రలో ఈశ్వరీరావు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. మౌనిక బాబాయి నరసింహం పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ తనది. మౌనిక తల్లిగా దేవయాని, ఎస్సైగా ఉత్తేజ్ తమ పాత్రల పరిధిమేర నటించారు.
అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్(నాగ చైతన్య) ఏదైనా బిజినెస్ చేయాలని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జుంబా డ్యాన్స్ సెంటర్ నడుపుతుంటాడు. రేవంత్ గ్రామానికే చెందిన మౌనిక(సాయి పల్లవి) బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో రేవంత్ జుంబా సెంటర్‌లో పార్ట్‌నర్‌గా జాయిన్ అవుతుంది. ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు కలిగిన రేవంత్, మౌనికల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది కాస్త నిదానంగా ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మధ్యలో కులం అడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి వారిద్దరి ప్రేమ కథా వ్యవహారం ఎలా నడిచింది? కులాల అడ్డంకి దాటుకొని చివరకు మౌనిక, రేవంత్ ఎలా ఒకటయ్యారు? అనేదే కథ.