దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". డీవీవీ దానయ్య నిర్మాత, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలు. అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రను పోషించారు. అలియా భట్ హీరోయిన్. ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.223 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
గత మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో పాత రికార్డులన్నీ బద్ధలైపోతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఈ టాక్‌తో సంబంధం లేకుండా కనకవర్షం కురిపిస్తుంది. థియేటర్లకు ప్రేక్షకులు తండోపతండాలుగా తరలివస్తుండటంతో ప్రతి షో హౌస్ ఫుల్ కలెక్షన్లలో నడుస్తుంది. ముఖ్యంగా, ప్రాంతీయ హద్దులను ఈ చిత్రం చెరిపేసింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాలం, హిందీ ఇలా అన్ని భాషల్లోనే సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది.
శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఏకంగా రూ.500 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ఈ వివరాలను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. సోమవారం కూడా ఈ చిత్రం ఇదే ఊపుతో ప్రదర్శితమవుతుంది. భారతీయ సినిమాకు "ఆర్ఆర్ఆర్" మరింత ఖ్యాతిని తీసుకొచ్చిందని కొనియాడారు. కరోనా సమయంలో సెలవులు కూడా లేని రోజుల్లో విడుదలైనప్పటికీ ఆర్ఆర్ఆర్ తిరుగులోని విధంగా దూసుకునిపోతుందని ఆయన ట్వీట్ చేశారు.